YS Jagan building plan schemeతెల్లారిందంటే చాలు… ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు బెంబేలెత్తిపోయే పరిస్థితి. ఏ పన్ను భారాన్ని ఏ రూపంలో తమ దగ్గర నుండి వసూలు చేసుకోవడానికి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్న రీతిలో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతుండడం ఏపీ ప్రజల వంతవుతోంది.

తాజాగా ఈ జాబితాలోనే మరో పన్ను బాదుడుకు జగన్ సర్కార్ శ్రీకారం చుట్టినట్లుగా మీడియా వర్గాలు కధనాలు ప్రసారం చేస్తున్నాయి. ‘అన్ ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్ పెనాల్టీ’ పేరుతో ఇంటి పన్నులో కలిపి వసూలు చేసేందుకు సిద్ధం కావడం ప్రజలపై మరో గుదిబండను మోపడమే.

700 నుండి 1000 రూపాయల వరకు నిర్ణయించిన ఈ పెనాల్టీలను ముందుగా నగరపాలక, పురపాలక సంఘాలలో అమలు పరచబోతున్నట్లుగా, ఇప్పటికే కొందరికి ఈ పన్ను నోటీసులు అందినట్లుగా ప్రసారం అవుతోన్న కధనాలు ఓ విధంగా ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి.

ఒకవేళ ఈ పెనాల్టీ రద్దు చేయాలంటే సదరు ఇంటి ప్లాన్ ను సచివాలయంలో చూపించాలని, అంతా సరిగా ఉంటే ఈ పెనాల్టీని రద్దు చేస్తారని లేనిపక్షంలో తప్పనిసరిగా చెల్లించే విధంగా ఈ కొత్త బాదుడుని ప్రజల నుండి దండుకునేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైందని విపక్షాలు మండిపడుతున్నాయి.

ఇప్పటికే పెంచిన ఆస్తి పన్ను మరియు చెత్త పన్నులు ప్రజలకు భారంగా మారాయి. అలాగే ప్రతి నెల ‘ట్రూ అప్ చార్జెస్’ పేరుతో కరెంటు బిల్లులు మోత మోగిస్తున్నారు. మరో వైపు ఓటీఎస్ పధకంతో పేదలపై భారం. ఇపుడు ఇంటి యజమానులకు ఈ కొత్త పన్ను. మొత్తంగా ఏ వర్గాన్ని విడిచిపెట్టకుండా వేస్తోన్న పన్నుల భారం చివరికి ప్రజలను ఏ స్థితికి తీసుకువెళ్తుందో చూడాలి.