YS Jagan - Narendra Modi-conspiracy on Chandrababu Naiduమాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడో అక్కడ అవినీతి చేసి ఉంటారని, దానిని వెలికి తీసి ఆయనను జైలుకు పంపాలని కృత నిశ్చయంతో ఉంది కొత్త ప్రభుత్వం. దీనికోసం జగన్ ప్రభుత్వం ఓ మంత్రి వర్గ ఉపసంఘాన్ని నియమించింది. కీలక విధాన నిర్ణయాలు, ప్రాజెక్టులు, పథకాలను సబ్‌కమిటీ సమీక్షిస్తుంది. ఈ కమిటీలో సభ్యులుగా మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, కన్నబాబు, అనిల్‌కుమార్‌ యాదవ్, గౌతంరెడ్డి ఉంటారు. అధికారవర్గం నుంచి ఐఏఎస్‌ అధికారి మన్మోహన్‌సింగ్‌ కు అవకాశం కల్పించారు.

ఇంకో విశేషం ఏమిటంటే సబ్‌కమిటీ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి కి చోటు కల్పించారు. ఒక కేబినెట్ సబ్‌కమిటీకి ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీలు ఉండటం చరిత్రలో ఇదే మొదటి సారి కావొచ్చు. ఇంకో విశేషం ఏమిటంటే ఈ సబ్‌కమిటీ లో ఒక్క పెద్దిరెడ్డికి తప్ప గతంలో ఎవరూ మంత్రిగా చేసిన అనుభవం లేదు. మిగతా వారందరూ మంత్రులుగా ఛార్జ్ తీసుకుని కనీసం పక్షం రోజులు కూడా కాలేదు. ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్న ఎంపీలకు కూడా ప్రభుత్వంలో పని చేసిన అనుభవం లేదు.

దీనితో ఈ సబ్‌కమిటీ ఇచ్చే నివేదిక రాజకీయ నివేదికగానే ఉంటుందా అనేది చూడాలి. అటువంటి రాజకీయ ప్రేరేపిత నివేదిక లీగల్ గా చెల్లుతుందా అనేది కూడా చూడాలి. మరోవైపు బీజేపీ జాతీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల సహా ఇంఛార్జ్ సునీల్ దేవదార్ రెండు సంవత్సరాలలో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పుకొచ్చారు. దీనితో చంద్రబాబు విషయంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి ఏదో కుట్ర పన్నుతున్నాయని తెలుగుదేశం పార్టీ నేతల అనుమానం.