ys-jagan-narendra-modi-andhra-pradesh-tirupatiరెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ మొట్టమొదటి సారిగా ఆంధ్రప్రదేశ్ వచ్చారు. ఆయనను రేణిగుంట విమానాశ్రయంలో గవర్నర్, ముఖ్యమంత్రి జగన్ రిసీవ్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆసక్తిగా దృశ్యం చోటు చేసుకుంది. ప్రధాని కాళ్ళకు మొక్కడానికి ముఖ్యమంత్రి రెండు సార్లు ప్రయత్నించగా ఆయన వద్దని వారించి ఆపారు. ఆ తరువాత జగన్ ఒంగకుండానే కాళ్ళను కళ్లకద్దుకున్నారు. ప్రధాని ఆప్యాయంగా జగన్ వెన్ను తట్టి తల నిమిరాడు.

ఆ తరువాత ప్రధాని మోదీ తిరుపతి సమీపంలోని రేణిగుంటలో ప్రజా ధన్యవాద సభలో ప్రసంగించారు. గతంలో పలుసార్లు తిరుపతి వచ్చినా కేంద్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకన్న ఆశీస్సుల కోసం వచ్చానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 130 కోట్ల మంది ప్రజల కలలు నెరవేరాలని బాలాజీని వేడుకుంటున్నానని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని బీజేపీ కార్యకర్తలకు చెప్పుకొచ్చారు.

“ఏపీ ఘన విజయం సాధించిన జగన్‌కు అభినందనలు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన..రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించాల్సిందిగా కోరుతున్నా. ఏపీ అభివృద్ధికి భాజపా కట్టుబడి ఉంది. కేంద్ర ప్రభుత్వం తరఫున సంపూర్ణంగా మద్దతు ఇస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి. ఏపీ అన్ని రంగాల్లో ముందుంది. ఏపీ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏవిధంగానూ వెనుకడుగు వేయబోదు’” అని మోదీ స్పష్టం చేశారు.

సభ తరువాత తిరుమల చేరుకున్న మోడీకి జగన్ మళ్ళీ ఎదురెళ్ళారు. ప్రధాని మోదీ వెంట శ్రీవారిని దర్శించుకున్నారు.