సిఎం జగన్మోహన్ రెడ్డి నేడు పశ్చిమ గోదావరి జిల్లా నరాసాపురంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. సిఎం జగన్ పర్యటన అంటే మొట్ట మొదట గుర్తుకు వచ్చేది జనసమీకరణ, పరదాలు, బ్యారికేడ్లే.
వివిద కారణాలతో పలుమార్లు సిఎం జగన్ జిల్లా పర్యటన వాయిదా పడిన తర్వాత నేడు జరుగుతుండటంతో, నరసాపురంలో వీవర్స్ కాలనీలో సిఎం జగన్ సభకు భారీగా జనసమీకరణ చేశారు.
ఈసారి విశేషమేమిటంటే సిఎం జగన్ సభకు ప్రత్యేకంగా ‘ఆహ్వాన పత్రాలు’ కూడా ముద్రించి ప్రజలకు పంచిపెట్టారు. ఇంతకాలం ఫ్లెక్సీ బ్యానర్లు, స్వాగత తోరణాలతో ముఖ్యమంత్రికి స్వాగతం పలికేవారు. ఇప్పుడు పెళ్ళిళ్ళకి పిలిచినట్లు సిఎం జగన్ సభకి ఆహ్వాన పత్రాలు ముద్రించి ప్రజలను ఆహ్వానిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాలలో ఇదో సరికొత్త ట్రెండ్ అనే చెప్పవచ్చు. కనుక ఇక నుంచి రాష్ట్రంలో ఇది ఆనవాయితీగా మారవచ్చు. మున్ముందు ఆహ్వానం అందిందంటూ ప్రజల సంతకాలు కూడా తీసుకొన్నా ఆశ్చర్యం లేదు.
వాలంటీర్లు ప్రజల కోసమే పనిచేస్తున్నారని వైసీపీ నేతలు చెప్పుకొంటున్నప్పటికీ వారు వైసీపీ కోసమే పనిచేస్తున్నారని అందరికీ తెలుసు. కనుక సిఎం జగన్ సభకు జనాలను ఆహ్వానించే బాధ్యత వారికీ అప్పగించారు. సంక్షేమ పధకాలు పొందుతున్న లబ్ధిదారులు సిఎం జగన్ సభకు హాజరవడం తప్పనిసరి లేకుంటే ఇబ్బందులు తప్పవు.
డ్వాక్రా సంఘాలన్నీ ప్రభుత్వం గుప్పెట్లోనే ఉంటాయి కనుక నియోజకవర్గంలో డ్వాక్రా సంఘాలలో మహిళలందరితో పాటు చుట్టుపక్కల ఇళ్ళలోని మహిళలను, స్కూల్ విద్యార్థులను తీసుకువచ్చే బాధ్యత వారిదే. కొన్ని రోజుల క్రితం విశాఖలో ప్రధాని సభకు డ్వాక్రా సంఘాల సభ్యులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని లేకుంటే తర్వాత మీరే ఇబ్బందిపడాల్సి వస్తుందటూ వాటి ఇన్‌ఛార్జ్‌లు ఫోన్ సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. నరసాపురంలో డ్వాక్రా సంఘాల మహిళలు కూడా స్థానిక వైసీపీ నేతల నుంచి అటువంటి ఒత్తిళ్ళే ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.
ఈ సభకు కనీసం లక్షకి తగ్గకుండా జనం హాజరయ్యేలా చూడాలని మంత్రులు, ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తుండటంతో స్థానిక వైసీపీ కార్యకర్తలు, వాలంటీర్లు, డ్వాక్రా సంఘాల మహిళలు, వెలుగు సభ్యులు స్వయంగా సభకు హాజరుకావడమే కాకుండా వీలైనంత ఎక్కువ మందిని తరలించారు. దీని కోసం నరసాపురంలోని ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ స్కూల్ బస్సులను తీసుకొని తిప్పుతున్నారు. సిఎం జగన్ సభకు హాజరైనవారు ముఖ్యంగా మహిళలు… మద్యలో లేచి వెళ్ళిపోకుండా మహిళా పోలీసులు, వాలంటీర్లు అన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నారు.
తమ పార్టీకి, అధినేతకి ప్రజలలో విశేషాదరణ ఉందని, రాష్ట్రంలో ప్రజలందరూ తమవైపే ఉన్నారంటూ వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకొంటుంటారు. కానీ నియోజకవర్గం సంక్షేమ పధకాలు ఇచ్చేందుకు లేదా అభివృద్ధి పనుల శంకుస్థాపన చేయడానికి సిఎం జగన్మోహన్ రెడ్డి వస్తుంటే స్వచ్ఛందంగా ప్రజలు వచ్చే పరిస్థితి లేకపోవడంతో బెదిరించో, డబ్బులిచ్చుకొనో జనసమీకరణ చేయవలసిరావడాన్ని ఏమనుకోవాలి?అదే… ఇటీవల టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలో పర్యటించినప్పుడు వేలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడం అందరూ చూశారు. అంటే అర్దం ఏమిటి?