YS Jagan Narasapuram Meetingముఖ్యమంత్రి, మంత్రుల బహిరంగసభలకు జనసమీకరణ చేయడం సాధారణ విషయమే. అయితే మెడపై కత్తి పెట్టినట్లు బలవంతంగా తరలించడం, సభకు వచ్చినవారిని మద్యలో బయటకు వెళ్ళనీయకుండా పోలీసులు అడ్డుకోవడమే చాలా అభ్యంతరకరం. సిఎం జగన్‌ సోమవారం నరసాపురం పర్యటనకి వచ్చినప్పుడు నియోజకవర్గంలో అన్ని డ్వాక్రా సంఘాల మహిళలని సిఎం సభకు హాజరుకాకపోతే రుణాలు మంజూరు చేయమని ఏపీఎంలు బెదిరించి మరీ తరలించారు. మళ్ళీ ప్రతీ సంఘంలో సభ్యులందరూ వచ్చారో లేదా, వచ్చినవారు సభ పూర్తయ్యేవరకు ఉన్నారా మద్యలో వెళ్లిపోయారా అని తెలుసుకొనేందుకు హాజరు కూడా నమోదు చేసుకొన్నారు.

నిన్న చివరి కార్తీక సోమవారంనాడే సిఎం సభ పెట్టడంతో నియోజకవర్గంలో మహిళలు పూజలు చేసుకోలేకపోయారు. ఆలయాలకు వెళ్ళలేకపోయారు. సిఎం సభకి వచ్చి హాజరు వేసుకొన్నాము కనుక పూజలు చేసుకోవడానికి తమను వెళ్ళనీయాలని కొందరు మహిళలు పోలీసులను కోరగా వారిని అనుమతించలేదు. బయటకు వెళ్ళాలని ప్రయత్నించినవారిని అడ్డుకొన్నారు. దాంతో చేసేదేమీ లేక సభ పూర్తయ్యేవరకు ఓపికగా కూర్చోవలసి వచ్చింది.

ఇక సిఎం సభకు బురఖాలు ధరించి వచ్చిన ముస్లిం మహిళలను బురఖాలు తీయించి లోపలకి పంపించారు. దాంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ భద్రతా కారణాల వలన ఎవరూ బురఖాలు, తలపై చూన్నీలు ధరించడానికి పోలీసులు అనుమతించలేదు.

సిఎం జగన్‌ పర్యటన సందర్భంగా భద్రత కోసం ఆదివారం సాయంత్రం నుంచి నరసాపురం పట్టణంలో పలు ప్రాంతాలలో దుకాణాలు మూసివేయించడంతో వ్యాపారస్తులు లబోదిబోమని మొత్తుకొన్నారు. చివరి కార్తీక సోమవారం సందర్భంగా మంచి వ్యాపారం జరుగుతుందనుకొంటే, పోలీసులు వచ్చి బలవంతంగా దుకాణాలు మూయించేశారని చిరు వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దుకాణాలు మూయించేసి బ్యారీకేడ్లు ఏర్పాటు చేసి రోడ్లపై ఎవరినీ తిరగనీయకుండా ఆంక్షలు విధించడంతో ప్రజలు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ఎక్కడ సిఎం సభ జరిగినా వైసీపీ నేతలు, పోలీసుల, మునిసిపల్ సిబ్బంది అవసరమైన ఏర్పాట్లు చేస్తుంటారు. కానీ వారితో పాటు రెవెన్యూ, ఆరోగ్య, పంచాయతీ రాజ్, డీఆర్‌డీయే, ఐసీడేఎస్ అధికారులు, సిబ్బంది కూడా పనిచేయక తప్పడం లేదు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు సంగతి చెప్పక్కరలేదు. వారున్నదే ఇటువంటి పనుల కోసం. జనాలకు ఆహ్వాన పత్రాలు పంచడం, వారికి నయాన్నో, భయాన్నో నచ్చజెప్పి సిఎం సభకి తరలించడం, పులిహోర పోట్లాలు, నీళ్ళ ప్యాకెట్లు పంపిణీ వంటి అనేక డ్యూటీలుంటాయి వారికి.

ఇక రాష్ట్రంలో ఎక్కడ సిఎం సభ జరిగినా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనసమీకరణ ఆర్టీసీ బస్సులు, స్కూలు బస్సులు తప్పనిసరిగా ఇవ్వాలసి ఉంటుంది. కనుక ఆయా ప్రాంతాలలో స్కూళ్ళకు సెలవు అనివార్యమే. నిన్న సిఎం సభకి జిల్లాలోని వివిద ప్రైవేట్ పాఠశాలకు చెందిన 600 బస్సులు, 100 ఆర్టీసీ బస్సులలో ప్రజలను తరలించారు. సిఎం కాన్వాయ్‌లో రక్షణ కోసం పోలీసులకు స్థానిక ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలు ఇవ్వక తప్పదు.

రాష్ట్రంలో ప్రజలందరూ వైసీపీకే మద్దతు ఇస్తున్నారని సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు గొప్పగా చెప్పుకొంటారు. కానీ సిఎం సభకు ఈవిదంగా బలవంతంగా జనాలను తరలించవలసి వస్తోంది. వైసీపీ నేతలు, అధికారులు, పోలీసులు ప్రదర్శిస్తున్న ఈ విధేయత, అత్యుత్సాహం కారణంగా సామాన్య ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకత పెరగకుండా ఉంటుందా? ఆలోచించుకొంటే మంచిది.