ys jagan movie tickets hike issueరాజకీయంగా ‘జనసేన’ ఎదగకుండా, ఆర్ధికంగా పవన్ కళ్యాణ్ మూలాలను దెబ్బ కొట్టడానికి ‘వకీల్ సాబ్’ సినిమా టికెట్ ధరలను తగ్గించారనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న ఓ ప్రధాన ఆరోపణ. ఈ విషయాన్ని పవన్ అయితే బహిరంగంగానే వెల్లడించారు, రాజకీయాలను పక్కన పెడితే హీరో నాని కూడా ఇదే రకమైన భావాలను వ్యక్తపరిచారు.

ప్రభుత్వం ఏమో, తాము పేద వాడికి వినోదం కలిగించడమే ప్రధాన లక్ష్యమని, అందుకోసమే టికెట్ ధరలను తగ్గించామని చెప్పుకొచ్చింది. దాదాపుగా పది నెలలుగా సాగుతోన్న ఈ వివాదం ఇటీవల చిరంజీవి బృందం తాడేపల్లి విచ్చేయడంతో, శుభంకార్డు పడినట్లుగా ప్రభుత్వం తరపున పేర్ని నాని కూడా ప్రకటించారు.

ఇక ‘భీమ్లా నాయక్’ విడుదల తేదీ కూడా రానే వచ్చింది. మరో మూడు రోజుల్లో ‘భీమ్లా’ బొమ్మ వెండితెరపై పడనుండగా, ఇప్పటివరకు టికెట్ ధరలకు సంబంధించిన కొత్త జీవో అయితే విడుదల కాలేదు. కానీ తనపై వచ్చిన ఆరోపణలను తుడిచివేసే విధంగా జగన్ కు ఓ మంచి అవకాశం వచ్చిదంటూ రఘురామకృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేసారు.

‘వకీల్ సాబ్’తో రేపిన వివాదాన్ని ‘భీమ్లా నాయక్’తో ముగింపు పలికి, తాను చేసిన తప్పును సరిద్దిద్దుకునే మంచి అవకాశం ఏపీ సీఎం జగన్ తలుపు తట్టిందని ఆర్ఆర్ఆర్ హితవు పలికారు. ‘భీమ్లా నాయక్’ సినిమా విడుదలకు ముందే టికెట్ ధరలకు సంబంధించిన కొత్త జీవోను ఇవ్వాలనేది ఆర్ఆర్ఆర్ సూచన.

మరి ఆర్ఆర్ఆర్ చెప్పినట్లుగా తనపై వచ్చిన ఆరోపణలను ఖండించే విధంగా కొత్త జీవోను సమాధానంగా జగన్ ఇస్తారా? లేక ఆ ఆరోపణలకు మరింత బలాన్ని ఇచ్చే విధంగా ‘భీమ్లా నాయక్’ సినిమా విడుదల అయిన తర్వాతే కొత్త జీవోను అమలు చేసే విధంగా నిర్ణయం తీసుకుంటారా? అనేది వేచిచూడాల్సిన అంశం. అయినా ఆర్ఆర్ఆర్ వ్యాఖ్యలను జగన్ వింటారా? అది మంచైనా, చెడైనా?