YS_Jagan_Mohan_Reddy's_Target_175_Seatsరెండు మూడు వారాల క్రితం 151 సీట్లు గెలుచుకొంటే చాలన్న సిఎం జగన్, ఇప్పుడు మొత్తం 175 సీట్లు వైసీపీయే గెలుచుకోవాలని పార్టీ నేతలకు ఎందుకు టార్గెట్ విధించారు?అనే ప్రశ్నకు చాలా కారణాలే కనిపిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణతో పార్టీలో మొదలైన అసంతృప్తి నేటికీ సెగలు కక్కుతూనే ఉన్నాయి. కొత్త, పాత మంత్రుల కారణంగా పార్టీలో రెండు గ్రూపులుగా విడిపోయింది. వారి మద్య అంతర్గత కీచులాటలు నిత్యకృత్యంగా మారిపోయాయి.

ఇక సంక్షేమ పధకాలతో ఓట్లు రాలకపోవచ్చుననే సంగతి గడపగడపలో అర్ధమవుతోంది. రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని అవాంఛనీయ ఘటనలు, పరిణామాలతో వైసీపీ ప్రభుత్వ ప్రతిష్ట రోజురోజుకీ మసకబారుతోంది.

ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌పై పెద్దగా ఆసక్తి చూపని బిజెపి కూడా ఇప్పుడు రాష్ట్రంలో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. మరోపక్క రాష్ట్రంలో టిడిపి, జనసేనల దూకుడు రోజురోజుకీ ఎక్కువవుతోంది. పవన్ కళ్యాణ్‌ అప్పుడే ముఖ్యమంత్రి ఎవరు?అనే చర్చ లేవదీశారు. బయట క్రమంగా మారుతున్న ఈ రాజకీయ వాతావరణం చూసి వైసీపీ నేతలకు కూడా తమ పార్టీపై క్రమంగా నమ్మకడం సడలడం సహజం.

ఇవన్నీ సరిపోనట్లు, ఓడిపోయేవారిని నేను భుజాన్న మోయలేనని, వచ్చే ఎన్నికలలో గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లు ఇస్తానని సిఎం జగన్మోహన్ రెడ్డి ఇదివరకే ప్రకటించారు. కనుక తమకు టికెట్ లభిస్తుందా లేదా?అనే అనుమానాలు అప్పుడే వైసీపీ నేతలలో మొదలైంది.

వైసీపీలో అంతర్గతంగా నెలకొన్న ఈ పరిస్థితులు, బయట జరుగుతున్నా రాజకీయ మార్పులు సిఎం జగన్మోహన్ రెడ్డికి తెలియవనుకోలేము.

కనుక వైసీపీ నేతలు భయపడుతున్నట్లుగా ప్రమాదం ఏమీ లేదని పార్టీ పరిస్థితి ఇదివరకు కంటే ఇప్పుడు ఇంకా గొప్పగా ఉందని వారిలో నమ్మకం కలిగించడానికే జగన్ ఈ టార్గెట్-175 పాట ప్రారంభించి ఉంటారు. ఆయన వెనుకే వినయవిధేయ మంత్రులందరూ ఇదే పాట కోరస్ పాడటం ప్రారంభిస్తారు. తద్వారా వచ్చే ఎన్నికలలో వైసీపీ 175 సీట్లు గెలుచుకోవడం ఖాయమనే భ్రమ కల్పిస్తూ పార్టీలో ఎవరూ చేజారిపోకుండా చూసుకోవాలనే తాపత్రయం కారణం కావచ్చు. కానీ వాస్తవ పరిస్థితి ఏమిటో దేశముదురు వైసీపీ నేతలకు తెలియదనుకోవడం అజ్ఞానమే అవుతుంది.