YS Jagan Mohan Reddy Andhra Pradesh Assemblyప్రతిపక్ష పార్టీగా అధికార పక్షం చేసే పనులను వ్యతిరేకించడం సాధారణమైన విషయమే. అయితే హుందాగా వ్యవహరించాల్సిన సందర్భాలు కొన్ని ఉంటాయి. ఆ సమయాలలో అధికార పార్టీ చేసిన పని తీరుకు అభినందనలు తెలిపితే… ప్రజాసంక్షేమ నిర్ణయాలలో ప్రతిపక్షం తమ వెంట ఉందని ప్రజలు భావిస్తారు. అలా కాకూండా తెల్లారి లేచింది మొదలు అధికార పార్టీ ఏం చేసినా… పూర్తిగా వ్యతిరేకిస్తూ వస్తుంటే… దానినేమంటారు..? అని రాజకీయ పరిభాషలో అడగాల్సి వస్తే… ఆ పేరు ‘జగన్’ అలియాస్ ‘వైసీపీ’ అని పిలవాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఒక్కసారి వర్తమాన రాజకీయాలను వీడి వైయస్ హాయంలోకి వెళితే… రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పధకాలకు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు బేషరతుగా మద్దతు తెలిపిన సందర్భాలున్నాయి. ‘ఆరోగ్యశ్రీ’ ప్రవేశపెట్టినపుడు అందులో ఉన్న ‘కార్పొరేట్’ లొసుగులను ఎత్తి చూపారు తప్ప, ఆ పధకం ప్రజలకు ఉపయోగికారి కాదని ఎన్నడూ చెప్పలేదు. అలాగే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్న సమయంలో ‘జలయజ్ఞం’ కాస్త ‘ధనయజ్ఞం’గా మారిపోయిందని ఆరోపణలు చేసారు తప్ప… ఫలానా ప్రాజెక్ట్ రాష్ట్రానికి అనవసరం అని ఏనాడూ ప్రస్తావించలేదు. అయితే ఇదే సమయంలో వైయస్ ను వ్యతిరేకించిన సందర్భాలు కోకొల్లలు.

అంతకు ముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా వైయస్ వ్యవహరించిన విధానం ఇదే. ఒక రాజకీయ నాయకుడికి ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉండి, ప్రజా శ్రేయస్సును ఆకాంక్షిస్తే రాజకీయ జీవితం పాఠాలు అదే నేర్పుతుంది. అయితే నేర్చుకోవాలన్న పట్టుదల, ప్రజాసేవ చేయాలన్న తపన మాత్రం ఉండి తీరాలి. సరిగ్గా ఇవే ప్రస్తుత ప్రతిపక్ష నేత జగన్ వద్ద కొరవడ్డాయని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి తెలియనిది కాదు. కనీసం రాజధాని కూడా లేకుండా సినిమా కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రిగా తన శక్తి సామర్ధ్యాలను మించి చంద్రబాబు కష్టపడుతున్నారన్నది బహిరంగ సత్యం. ఇదే సమయంలో ఆర్ధిక వనరులు లేకపోయినా… ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఎక్కడా లోటు లేకుండా చేస్తున్న పాలనలో ఉన్న లోపాలను ఎత్తి చూపాల్సిన బాధ్యత ప్రతిపక్షంపై ఉంది. ప్రజలు ఆ బాధ్యతను వైసీపీ అధినేత జగన్ కు అప్పగించారు.

లోపాలను ఎత్తి చూపమని ప్రజలు నియమిస్తే… జగన్ ఏం చేస్తున్నారు అంటే… అసలు లోపాలు కాదు, పాలనే తప్పని, తానూ ముఖ్యమంత్రి అయితే తప్ప పాలన రాదన్న భావాన్ని వ్యక్తపరుస్తున్నారు. సరిగ్గా ఇదే ప్రజల నుండి, ప్రజా ఆలోచనల నుండి జగన్ ను దూరం చేస్తోందన్నది రాజకీయ వర్గాల మాట. గడిచిన రెండేళ్ళ కాలంలో చంద్రబాబును నిర్మొహమాటంగా అభినందించడానికి జగన్ కు ఒక్క విషయమూ తారసపడలేదా? ఈ ప్రశ్న ఉత్పన్నమైతే… ‘అభినందించాలి’ అన్న ఆలోచన వస్తేనే కదా… అభినందనలు తెలపడానికి అన్న విషయం తెరపైకి వస్తుంది.

రాజధానిని ప్రకటించి… ప్రజా రాజధాని కడతాను అని చంద్రబాబు అంటే… కొండల మధ్యలో బోలెడంత ఖాళీ స్థలం ఉంది… అక్కడ కట్టమంటూ అమరావతికి వ్యతిరేకంగా నినాదం చేసారు జగన్. జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరంకు రాష్ట్రం ఎందుకు నిధులు కేటాయించింది అన్నారు? ఒకవేళ కేటాయించకపోతే కేంద్రం పట్టించుకోకపోతే రాష్ట్రం ఏం చేసింది అంటారు? కేసీఆర్ ను చంద్రబాబు కలిస్తే లాలూచీ అంటున్నారు… కలవకపోతే భయం… అని వ్యాఖ్యలు చేస్తున్నారు. పట్టిసీమ ప్రాజెక్ట్ లో నిజంగా అవినీతి జరిగి ఉంటే, దానిని ప్రజల ముందు సాక్ష్యాలతో సహా పెడితే ఉత్తమం గానీ, ‘అసలు పట్టిసీమ ప్రాజెక్ట్ ఎందుకు?’ అని జగన్ వ్యాఖ్యానించడం తన జీవితంలో వేసిన అసలుసిసలు తప్పటడుగు కాదా? హుదుద్ ప్రభావంతో విశాఖను వరుణుడు కబ్జా చేస్తే… ఒక్క నెల రోజుల్లోనే మునుపటి స్థాయికి తీసుకొచ్చిన చంద్రబాబును విశాఖ వాసులు ఆకాశానికేత్తేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే అలాంటి సందర్భాలలో కూడా జగన్ విమర్శలకే ప్రాధాన్యత ఇచ్చి తన మార్క్ ను చాటుకున్నారు.

ఇలా ఒక్క అంశంలో కాకపోతే ఒక్క విషయంలోనూ ప్రభుత్వానికి మద్దతు తెలపని జగన్ ను అసలు నాయకుడిగా ప్రజలు ఆమోదిస్తారనుకోవడం అత్యాసే అవుతుందని విశ్లేషకులు వ్యక్తపరుస్తున్న భావన. ప్రజల చేత ఆమోదం పొందిన అంశాలలో కూడా జగన్ వ్యతిరేక భావాలు వ్యక్తం చేయడం బహుశా ఆయన ఆలోచన తీరుకు అద్దం పడుతుందని చెప్పవచ్చు. దీంతో రానూ రానూ జగన్ చేస్తున్న వ్యాఖ్యలకు ప్రాధాన్యత లేకుండా పోతోంది. ఇదే భావన వైసీపీ నేతల్లో సైతం ఉండడం వల్లనే సదరు నేతలంతా పార్టీని వీడడానికి సిద్ధమవుతున్నారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

ప్రస్తుతం రెండేళ్ళు పూర్తయ్యింది. మరో మూడేళ్ళ పాటు చంద్రబాబు పాలన ఉండనుంది. మరి ఆ మూడు సంవత్సరాలలో అయినా జగన్ నోట నుండి చంద్రబాబుకు ‘అభినందన’ అనే పదం వస్తుందో లేదో వేచిచూడాలి. ‘ఎడ్డెం అంటే తెడ్డెం’ అనే భావన అన్ని సార్లు పని చేయదన్న విషయం గుర్తిస్తేనే రాజకీయాల్లో జగన్ మనుగడ సాధ్యం అన్న విశ్లేషణలు ఊపందుకుంటున్నాయి. లేదంటే… అసెంబ్లీలో చంద్రబాబు చెప్పినట్లు… జగన్ ఎందుకు ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు? అన్న ప్రశ్న వస్తే… ‘నవ్వులపాలు’ కావడానికే అన్న సమాధానం ప్రజల నుండి వచ్చే ప్రమాదం ఉందని పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి.

teacher rape