YS Jagan to speak at Davos on May 22ఈ నెల 22 నుంచి 27వరకు స్విట్జర్‌లాండ్‌లో దావోస్ నగరంలో ప్రపంచ ఆర్ధిక సదస్సు జరుగబోతోంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ సదస్సులో పాల్గొని తొలిరోజున ప్రారంభోత్సవం సందర్భంగా ప్రసంగించనున్నారు. “పారిశ్రామికాభివృద్ధి అజెండా-2030’ అనే అంశంపై సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగించనున్నారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం చేప్పటిన పలుచర్యల గురించి వివరిస్తారు. కొన్ని రంగాలలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు చేయవలసిన అవసరం గురించి ఆయన తన ప్రసంగంలో వివరిస్తారు.

అదేవిదంగా పారిశ్రామిక విధానాలను మరింత మెరుగుపరచాల్సిన అవసరం గురించి వివరిస్తారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తమ ప్రభుత్వం సంక్షేమ పధకాల ద్వారా సామాజిక మార్పు కోసం ఏవిదంగా కృషి చేస్తోందో సిఎం జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగంలో వివరిస్తారు.

దావోస్ ఆర్ధిక సదస్సులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కూడా భాగస్వామిగా చేరేందుకుగాను సిఎం జగన్మోహన్ రెడ్డి ఒప్పంద పత్రాలపై సంతకం చేస్తారు. తద్వారా ఇప్పుడు జరుగబోయే సదస్సుతో సహా భవిష్యత్‌లో ఏటేటా జరుగబోయే సదస్సులలో కూడా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రతిధులు, రాష్ట్రం నుంచి పారిశ్రామికవేత్తలు ఆ సదస్సులో పాల్గొనగలుగుతారు.

ఈ సదస్సుకి భారత్‌లో వివిద రాష్ట్రాలతో పాటు వివిద దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు హాజరవుతుంటారు. కనుక మే 22న సిఎం జగన్మోహన్ రెడ్డి దావోస్‌ సదస్సులో ప్రసంగించేవరకు ప్రజలు ఓపిక పడితే చాలు. ఆయన ప్రసంగంతో పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి తరలివచ్చేస్తారు. ఏపీలో పెట్టుబడుల వరద పోటెత్తుతుంది. రాష్ట్రంలో ఎక్కడికక్కడ పరిశ్రమలు ఏర్పాటవుతాయి. నిరుద్యోగ సమస్య తీరిపోతుంది. రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంది కనుక మరిన్ని సంక్షేమ పధకాలు అమలుచేసుకోవచ్చు. అప్పుడు కనుచూపు మేర ఇక ఆంధ్రప్రదేశ్‌కు అన్ని మంచి రోజులే! కనుక ప్రజలందరూ పండగ చేసుకోవడానికి సిద్దంగా ఉండాలి.