YS-Jagan-Three-Capitals-Anadhra-Pradeshవిశాఖ నుంచి సిఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించబోతున్నారంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈరోజు అసెంబ్లీ వద్ద మీడియా పాయింట్‌ వద్ద పత్రిక విలేఖరులకు చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేసుకొని పరిపాలన ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. త్వరలోనే మళ్ళీ శాసనసభలో మూడు రాజధానుల బిల్లు పెడతామని మంత్రి అమర్నాథ్ చెప్పారు.

మూడేళ్ళుగా జగన్ ప్రభుత్వం ఆడుతున్న ఈ మూడు ముక్కలాటకి ఆంధ్రప్రదేశ్‌ బలైపోతోంది. మూడు రాజధానులకి ఫిక్స్ అయినప్పుడు సాధ్యమైనంత త్వరగా ఆ నిర్ణయాన్ని అమలుచేసి ఉండాలి. కానీ తమ ప్రతిపాదనకు ప్రజామోదం పొందడానికి ప్రజల మద్య ప్రాంతీయ విబేధాలు రెచ్చగొట్టడం దేనికి?అమరావతిలోనే రాజధాని నిర్మిస్తామంటూ హైకోర్టుని తప్పుదోవ పట్టించడం దేనికి?ఇప్పుడు మాత్రం హైకోర్టు, కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తాయా?అంగీకరించకపోతే ఏమవుతుంది?అప్పుడు ఈ కధ మళ్ళీ మొదటికొస్తుంది కదా?

గత ఏడాది ఉగాదికల్లా విశాఖ షిఫ్ట్ అయిపోతామని చెప్పారు. విశాఖకు రాజధాని వచ్చేస్తోందనే నమ్మకంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు భారీ పెట్టుబడులు పెట్టి అనేక వెంచర్లు వేశారు. కానీ విశాఖ రాజధానికి హైకోర్టు బ్రేకులు వేయడంతో వారందరూ తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మళ్ళీ విశాఖ రాజధాని అంటోంది. మళ్ళీ హైకోర్టు లేదా ఈసారి కేంద్ర ప్రభుత్వం బ్రేకులు వేయవచ్చు. అప్పుడు మళ్ళీ రియల్ ఎస్టేట్ తదితర రంగాలు తీవ్రంగా నష్టపోవచ్చు.

అయినా విశాఖ నుంచి పరిపాలించడానికి కొత్త సచివాలయం, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలకు అధికారిక నివాసాల కోసం అనేక భవనాలు కట్టాలి. ఇంకా అనేక ప్రభుత్వ కార్యాలయాలకు భవనాలు నిర్మించాలి. ఇవన్నీ ఎప్పుడు పూర్తవుతాయి? ఎప్పుడు పరిపాలన మొదలుపెడతారు? విశాఖ నగరంలో ఇప్పుడున్న వాహనాలు తిరిగేందుకు రోడ్లు సరిపోవడం లేదు. ఎగ్జిక్యూటివ్ రాజధాని అంటూ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు వేలాదిమంది అధికారులు, ఉద్యోగులు తరలివస్తే పరిస్థితి ఏమిటి?

కనుక శాసనసభలో వైసీపీకి బలం ఉంది కదాని మూడు రాజధానుల బిల్లులు పెట్టేసి విశాఖకు వచ్చేయాలనుకొంటే సరిపోదు. ముందుగా ఈ ప్రతిపాదనకు హైకోర్టు, కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని అనుమతులు లిఖితపూర్వకంగా తెచ్చుకొని, విశాఖనగరంలో మౌలిక వసతులన్నీ ఏర్పాటు చేసి ఆ తర్వాత పెట్టేబేడా సర్దుకొని విశాఖకు వస్తే మంచిది. లేకుంటే పోయేది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, జగన్ ప్రభుత్వం పరువే. కనుక వైసీపీ ఇప్పటికైనా సమయం దగ్గర పడుతోందని గ్రహించి మేల్కొని ప్రజల ఆకాంక్షల ప్రకారం నడుచుకొంటే మంచిది.

ఈ మూడు ముక్కలాటతో వైసీపీకి పుణ్యకాలం కూడా పూర్తయిపోతే, ఐదేళ్ళు అవకాశం ఇచ్చినా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినందుకు ప్రజలు వచ్చే ఎన్నికలలో తగిన విదంగా బుద్ధి చెప్పడం ఖాయం.