y-s-jagan-mohan-reddyతాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళని వెనకటికి ఎవరో మొండిగా వాదించినట్లు, ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి బుర్రలో నుంచి ఉద్భవించిన మూడు రాజధానులతోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వితండవాదన చేస్తూ, ఒక్క ఇటుక కూడా పెట్టకుండా మూడున్నరేళ్ళు కాలక్షేపం చేసేశారు. మూడు రాజధానులతో మాత్రమే అభివృద్ధి సాధ్యపడుతుందని గట్టిగా వాదిస్తున్నారు కనుకనే ఈ మూడున్నరేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ రారాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేకపోయారేమో? అని సరిపెట్టుకోక తప్పదు.

కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వ్యాపించి ఉన్న సువిశాలమైన భారతదేశానికి ఒక్కటే రాజధాని ఢిల్లీలో ఉంది. కానీ దానికి ఎంతో దూరంగా మన పొరుగునే ఉన్న తెలంగాణ రాష్ట్రం మన కళ్ళ ముందే అన్నివిధాలుగా అభివృద్ధి చెందింది.

ఒకవేళ జగన్ వాదన నిజమానుకొంటే తెలంగాణ కూడా అభివృద్ధి చెందకూడదు కదా? కానీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దానిని ఎన్నటికీ అందుకోలేనంత ఎత్తులో వేగంగా అభివృద్ధిపదంలో దూసుకుపోతోంది. మరి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మాత్రం ఎందుకు అభివృద్ధి చెందటం లేదు?అంటే మన పాలకుల ఆలోచనలోనే లోపం ఉందని, దూరదృష్టి లోపించిందని, రాష్ట్రాభివృద్ధి కంటే రాజకీయ అవసరాలే ముఖ్యమని భావిస్తున్నందునే అని చెప్పక తప్పదు.

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఈ రాజకీయాలను చూసి యావత్ దేశ ప్రజలు నవ్వుకొంటుంటే, మా కుందేలుకి మూడే కాళ్ళు… మూడు కాళ్ళ కుందేలే చాలా మంచిదన్నట్లు సిఎం జగన్మోహన్ రెడ్డి జాతీయ పత్రిక ది హిందూకి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో చెప్పడం ఇంకా హాస్యాస్పదంగా ఉంది. తన మానసిక పుత్రిక ‘మూడు రాజధానులు-వికేంద్రీకరణ-విశాఖ రాజధాని’ గురించి ఆయన మరోసారి మళ్ళీ అవే విషయాలు చెప్పారు.

*ఆర్ధికపరిమితులు, పరిపాలనా వికేంద్రీకరణ, పరిపాలనా సౌలభ్యం కొరకే విశాఖను రాజధానిగా ఎంచుకోవడానికి ప్రధాన కారణాలు.

*అందమైన విశాఖ నగరానికి చాలా తక్కువ ఖర్చుతో రాజధానిగా అభివృద్ధి చేయవచ్చు. అమరావతిలో రాజధాని నిర్మించాలంటే సుమారు రూ.1,08,000 కోట్లు కావాల్సి ఉంటుంది. అంత ఆర్ధిక భారం ప్రభుత్వం భరించే పరిస్థితిలో లేదు. ఒకవేళ అందుకు సిద్దపడినా రాజధానిని నిర్మించాలంటే మరో 20 ఏళ్ళు సమయం పడుతుంది. అదే విశాఖను రాజధానిగా అభివృద్ధి చేయాలంటే కేవలం రూ.5-10,000 కోట్లు పెట్టుబడితో చాలా తక్కువ సమయంలో అభివృద్ధి చేసుకోవచ్చు.

*విశాఖ, అమరావతి, కర్నూలులో మూడు రాజధానులు ఏర్పాటు చేయడం ద్వారా అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందడమే కాకుండా, అన్ని ప్రాంతాల ప్రజలకు తాము కూడా భాగస్వాములమనే భావన కలుగుతుంది.

*అయితే ముఖ్యమంత్రినైన నేను ఎక్కడ కూర్చొని పరిపాలన చేయాలో ప్రతిపక్షాలు చెపుతున్నాయి. ఆనాడు అమరావతిలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో సహా ఆ పార్టీ నేతలందరూ ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి అమరావతిలో విచ్చలవిడిగా భూములు కొనుగోలు చేసినందున, తమ రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బ తింటుందనే భయంతోనే మా ఈ మూడు రాజధానుల ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

*సంక్షేమ పధకాల గురించి కూడా ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. అమ్మ ఒడి, నాడు-నేడు, రైతు భరోసా వంటివన్నీ సామాన్య ప్రజల జీవితాలలో వెలుగులు నింపడానికి చేస్తున్న ప్రయత్నాలే. ఆరోగ్యశ్రీ పధకం ద్వారా కూడా రాష్ట్రంలో అనేకమంది లభ్ది పొందుతున్నారు,” అని సిఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు.