YS-Jagan Speech at Talli bidda Express Launchప్రతి పండగకు స్కూల్స్ కు సెలవులు ఎలా అయితే ఇస్తారో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రతి పండగకు “జ్ఞానగుళికలు” అందిస్తుంటారు. అదేలేండి… తెలుగు పలకడంలో జగన్ పలికే తప్పులను టీడీపీ సోషల్ మీడియా ‘జ్ఞానగుళిక’గా నామకరణం చేసి ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఎన్నో జ్ఞానగుళికలు వదిలిన జగన్, తాజాగా ఉగాది పర్వదినానికి ఒక రోజు ముందు నిర్వహించిన ‘తల్లి – బిడ్డ’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా తన వంతుగా ‘జ్ఞానగుళికలు’ వదిలారు. అందులో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న విషయం ఏమిటంటే… జగన్ నోటి వెంట జాలువారిన “గర్వం దాల్చడం.”

అదేంటి… ఇదేంటి తెలుగులో కొత్త పద అమరిక అనుకుంటున్నారా? సరిగ్గా ఇక్కడే మనకు టీడీపీ సోషల్ మీడియా ఓ సమాధానం ఇస్తోంది. ‘పుట్టించకపోతే పదాలు ఎలా పుడతాయని’ ఆనాడు పింగళి గారు చెప్పిన వ్యాఖ్యలను స్పృశిస్తున్నారు. అందుకే బహిరంగ సభకు వచ్చిన ప్రతిసారి మన సీఎం గారు ఓ కొత్త తెలుగు పదాన్నో లేక పద అమరికనో కూర్పు చేస్తూ ప్రసంగిస్తారని చెప్తున్నారు.

ఏంటి ఇదేదో ర్యాగింగ్ చేసినట్లుగా అనిపిస్తోందా? మరి టీడీపీ సోషల్ మీడియా విభాగపు ఆలోచనలు ఏమిటో తెలియదు గానీ, ఈ ‘జ్ఞానగుళికలు’ మాత్రం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్చల్ చేస్తున్నాయి. ఇలాంటివి విని విని విరక్తి చెందుతున్న ఏపీ వాసులకు కష్టకాలం ఏమిటంటే, ఇంకా రెండేళ్ల పాటు సీఎంగా జగన్ కు సమయం ఉండడంతో, ఇంకెన్ని ‘జ్ఞానగుళికలు’ వినాలోనని వాపోతున్నారు.