YS Jagan Mohan Reddyవైసీపీ ప్రొడక్షన్స్ సమర్పించు అత్యద్భుతమైన సినిమా… “జనం చెవిలో జగన్ పూలు,” ఏప్రిల్ 1 విడుదల. హ్యాష్ ట్యాగ్ “బాదుడేబాదుడు బై జగన్” ఇది ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ వేసిన పోస్ట్ ఒకటి. అధికారంలోకి వస్తే తాను ఏం చేస్తానో అన్న విషయాన్ని ప్రతిపక్షంలో ఉండగా చెప్పిన జగన్, అధికారం చేపట్టి మూడేళ్ళుగా ఏం చేస్తున్నారు? అన్న కంటెంట్ తో ‘ఏప్రిల్ ఫూల్’ పేరుతో ఓ వీడియోను ఏ సందర్భంగా పోస్ట్ చేసారు.

కరెంట్ చార్జీల మొదలుకుని మద్యనిషేధం, ప్రత్యేక హోదా, సన్నబియ్యం, రాజధాని, సీపీఎస్ రద్దు తదితర అంశాలపై నాడు జగన్ ఏం చెప్పారు? నేడు ఏం చేస్తున్నారు? అన్న అంశాలతో ఏపీ ప్రజలు ఎలా ఏప్రిల్ ఫూల్ అయ్యారో చెప్తూ… అంతిమంగా ‘సంక్షేమాల ముఖ్యమంత్రిగా చెప్తున్న ఈయన, సామాన్యుడిపై ఎక్కువ భారం మోపుతూ… ధనికులు వాడే 400 యూనిట్లు పైన విద్యుత్ వినియోగం చేసేవారికి 55 పైసలు పెంచారు. ఇంత పేదల ముఖ్యమంత్రిని ఈ పేదలు భరించలేరు’ అంటూ ఓ పెద్దావిడ చెప్పే మాటలతో ముగించారు.

ఈ వీడియోను టీడీపీ సోషల్ మీడియా వింగ్ అంతా సర్క్యులేట్ చేస్తోంది. దీనికి నారా లోకేష్ కాస్త ఎటకారాన్ని జోడించి ‘వైసీపీ ప్రొడక్షన్స్ వారి అత్యద్భుతమైన సినిమా’ అంటూ కీర్తించారు. ఇటీవల కాలంలో లోకేష్ ఎటకారం మాములుగా ఉండట్లేదన్నది పార్టీ వర్గీయుల మాట. గురువారం నాడు విద్యుత్ చార్జీలపై నిరసన తెలియజేసిన సమయంలో కూడా వైసీపీ వర్గాలను ఉద్దేశించి ఎటకారపు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.

ముఖ్యమంత్రికి అత్యంత చేరువలో, డీజీపీ ఆఫీస్ కి 300 మీటర్ల దూరంలో ఉన్న మన పార్టీ ఆఫీస్ కు 12 గంటలకు కరెంట్ తీసేసారు, ఇప్పుడు సమయం 2.10 అయ్యింది, ఇదిగో పేటిఎమ్ బ్యాచ్ రాసుకోండి, మళ్ళీ మీరేగా ట్రోల్ చేసేది, పేటీఎం బ్యాచ్ మీకే చెప్తున్నా, రాసుకోండి అంటూ తనదైన శైలిలో చెలరేగిపోయారు. లోకేష్ లో వచ్చిన ఈ మార్పుకు పార్టీ నేతలు, కార్యకర్తలు అంతా కూడా ఫిదా అయిపోతున్నారు.

వినోదంతో కూడిన విమర్శలు ఎప్పుడూ రాజకీయాలలో పండుతాయి. అలాగే అలా చేసిన నాయకులు మాస్ లీడర్స్ గా ఎదుగుతారు. ఇది చరిత్ర చెప్తోంది. అయితే నారా లోకేష్ ఆ స్థాయికి వెళ్ళడానికి చాలా సమయం ఉంది గానీ, గత ఎన్నికల సమయానికి – వర్తమానానికి పోలిస్తే, ఎనలేని మార్పును స్పష్టంగా చూడవచ్చు. ఇదే మరో రెండేళ్ల పాటు కొనసాగిస్తే, నారా లోకేష్ అన్న పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమ్రోగడానికి పెద్ద సమయం పట్టకపోవచ్చు.