YS Jagan Mohan Reddy - KTR Meetఅది 2010… జగన్ తన ఓదార్పు యాత్రను ఆంధ్రప్రదేశ్ లో ముగించుకుని తెలంగాణలోకి రాబోతున్నారు. జగన్ ఓదార్పు యాత్రను అడ్డుకోవడానికి తెలంగాణ వాదులు ప్రయత్నించారు. అప్పుడు వైకాపాలో ఉన్న కొండా సురేఖ దంపతులు జగన్ కు అండగా ఉన్నారు. మానుకోట రైల్వే స్టేషన్ రంగస్థలంలా మారింది. పోలీసుల, జగన్ మనుషుల కాల్పులలో 19 మంది గాయపడ్డారు. అప్పటికే జగన్ సమైక్య రాగం అందుకోవడంతో చెలరేగిన హింస తెలంగాణాలో వైకాపా అవకాశాలను సజీవ సమాధి చేసింది.

ఆ సమయంలో ఉప్పూ నిప్పులా ఉండే వైకాపా, తెరాస నాయకులు ఇప్పుడు మళ్ళీ తమ ఉమ్మడి శత్రువు చంద్రబాబు నాయుడును ఎదురుకోవడానికి చేతులు కలుపుతున్నారు. జగన్‌తో కేటీఆర్‌ కాసేపట్లో హైదరాబాద్‌లో చర్చలు జరపనున్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌లో కలిసి వచ్చే విషయంపై వైకాపాతో చర్చలు జరపాలని తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్‌ నిర్ణయించారు. కేసీఆర్‌ ఆదేశాల మేరకు తెరాస నేతలు కేటీఆర్‌, వినోద్‌, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డి తదితరులు జగన్‌తో చర్చలు జరపనున్నారు.

ఫెడరల్ ఫ్రంట్ ముసుగులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వేలు పెట్టే ప్రయత్నం చేస్తుంది తెరాస. ఇప్పటిదాకా కొంత సీక్రెట్ గా ఉన్న ఈ స్నేహం నేడు బహిర్గతం అవ్వబోతుంది. హైదరాబాద్ లో ఆంధ్రకు సెట్లర్లు తెరాసకు మద్దతు ఇచ్చారు. ఈ క్రమంలో ఆంధ్రాలో తెరాసకు బాగా పాపులారిటీ ఉందనీ అది తనకు ఉపయోగపడుతుందని జగన్ భావిస్తున్నారు. దీనితో ఈ స్నేహాన్ని బహిరంగ పర్చడానికి ఆయన భయపడలేదు. తెరాస ఆంధ్ర వస్తే దానితో పాటు ఎంఐఎం కూడా వచ్చి ముస్లిం ఓట్లను తెచ్చి పెడుతుందని జగన్ ఆశ.

అయితే హైదరాబాద్ లో సెట్లర్ల ఓట్లు తెరాసకు పడటానికి కారణం స్థానిక పరిస్థితులే అని విశ్లేషకుల అభిప్రాయం. హైదరాబాద్ నగర పాలిక ఎన్నికల నుండే ఆంధ్రప్రదేశ్ అంశాలు తెలంగాణాలో ప్రభావం చూపించలేకపోతున్నాయని అర్ధం అయిపోయింది. అది చంద్రబాబు వ్యతిరేక ఓటు అని భావించి తెరాసను దగ్గరకి చేర్చుకుంటున్నారు జగన్. అయితే ఇది మొదటికే మోసం తెచ్చే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణాలో చంద్రబాబు ప్రమేయాన్ని తెలంగాణ ప్రజలు ఎలా తిరస్కరించారో ఏపీ ప్రజలు కూడా అలాగే ఆలోచిస్తే జగన్ ఏమైపోతారో?