YS Jagan Mohan Reddy High Court of Andhra Pradesh151 ఎమ్మెల్యేలతో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది కోర్టుల విషయంలోనే. ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం తీసుకుంటున్న అనేక వివాదాస్పద నిర్ణయాలకు కోర్టులు అడ్డం పడుతూనే ఉన్నాయి. తాజాగా శుక్రవారం ఒక్క రోజే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మూడు సార్లు ఎదురుదెబ్బలు తగిలాయి.

మొదటిగా…. పంచాయతీ కార్యాలయలకు రంగులపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 623 జీవోను హైకోర్టు రద్దు చేసింది. సుప్రీం, హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా జీవో ఎందుకు ఇచ్చారో వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. తెలివిగా నాలుగో రంగు యాడ్ చేసి, రంగులకు డెఫినిషన్లు ఇచ్చినా కోర్టు ఒప్పుకోలేదు. పైగా కోర్టు ధిక్కారణ కేసు కూడా నమోదు చేసింది.

మరోవైపు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన డాక్టర్ సుధాకర్‌ వ్యవహారంపై కూడా హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. విశాఖ పోలీసులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని సీబీఐను ఆదేశించింది. 8 వారాల్లోగా విచారణ పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాల్లో తెలిపింది. సుధాకర్‌ శరీరంపై గాయాలున్న విషయం మేజిస్ట్రేట్‌ నివేదికలో ఉందని, ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో గాయాల ఊసే లేదని ధర్మాసనం పేర్కొంది. ప్రభుత్వ నివేదికను నమ్మడం లేదని కోర్టు చెప్పడం గమనార్హం. దీని వెనుక భారీ కుట్ర ఉందని భావిస్తున్నామని, ఈ కారణాలతో సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నట్టు తెలిపింది.

ఇక చివరిగా చంద్రబాబు హయాంలోని ఇంటలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ను జగన్ అధికారంలోకి రాగానే ఏకంగా దేశద్రోహం కేసు పెట్టి అవినీతి కారణాలు చూపుతూ…. సస్పెండ్ చేసింది. ప్రతిపక్షంలో ఉండగా ఏబీ వెంకటేశ్వరరావు చంద్రబాబు తొత్తు అంటూ అనేక వ్యాఖ్యలు చేసే వారు జగన్… కేవలం కక్షసాధింపు గానే తనను ఇరికించారని ఏబీ వాదన.

దానిని సమర్థిస్తూ… సస్పెన్షన్ ను రద్దు చేసింది హై కోర్టు. ఈ విషయంగా గతంలో ప్రభుత్వానికి అనుకూలంగా ఇచ్చిన క్యాట్ ఆర్డర్ ని కూడా పక్కన పెట్టింద హై కోర్టు. ఈ మూడు విషయాలలోనూ ప్రభుత్వం అతిగా ప్రవర్తించి లేని కష్టాలను కొని తెచ్చుకుందని నిపుణులు ఆరోపిస్తున్నారు.