YS-Jagan-Mohan-Reddy-Four-Years-Ruleఏ రాజకీయ పార్టీకైనా అధికారంలోకి రావడం ఓ కల. వచ్చిన తర్వాత ఏమి చేసిందనేది చాలా ముఖ్యం. కనుక వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళు పూర్తయిన సందర్భంగా, తమ ప్రభుత్వం చాలా అద్భుతంగా రాష్ట్రాన్ని పాలిస్తోందని, ఇచ్చిన హామీలన్నీ అమలుచేసిందని, కనుక రాష్ట్రంలో ప్రజలందరూ చాలా సంతృప్తిగా ఉన్నారని వైసీపీ నేతలు చెప్పుకొంటున్నారు. అది సహజమే.

అయితే ఈ నాలుగేళ్ళలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందా లేదా?అనేదే ప్రామాణికం. సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరూ కూడా ఈ ప్రామాణిక సత్యం గురించి మాట్లాడకుండా ‘ప్రజలకు ఇచ్చిన హామీలను 99% నెరవేర్చాం’ అని మాత్రమే చెప్పుకొంటున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో అభివృద్ధి జరుగలేదు కనుకనే!

ఈ నాలుగేళ్ళలో సంక్షేమ పధకాలతో, మూడు రాజధానుల కబుర్లతోనే గడిపేశారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుంటే శంకుస్థాపనలు చేయడం మొదలుపెట్టి ఇదే మేము “చేయబోయే అభివృద్ధి” అని చెప్పుకొంటున్నారు. నిజానికి అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి పనులపై శ్రద్ద పెట్టి ఉంటే, నేడు తెలంగాణ మంత్రులులాగా “ఇవిగో మేము చేసిన అభివృధ్ది పనులు…” అంటూ వైసీపీ నేతలు కూడా ఏపీ ప్రజలకు ధైర్యంగా చెప్పుకోగలిగేవారు. కానీ సంక్షేమ పధకాలనే నమ్ముకొని ఇప్పుడు వాటితో గట్టెక్కగలమా లేదా?అని ఆందోళన చెందుతున్నారు. అది స్వయంకృతాపరాధం కనుక ఎవరినీ నిందించనవసరం లేదు.

ఈ నాలుగేళ్ళ వైసీపీ పాలనలో ప్రధానంగా కనబడుతున్నవి ఏమిటంటే, సంక్షేమ పధకాలు, వాటి కోసం అప్పులు, వాటి కోసం ప్రజలపై భారం పెంచుతుండటం, భవనాలకు వైసీపీ రంగులు వేసుకోవడం, సంస్థలకు, జిల్లాలకు పేర్లు మార్చడం, మంత్రులు తమ స్థాయి, హుందాతనం మరిచి రోడ్లపై డ్యాన్సులు చేస్తుండటం, అనుచితంగా భాషతో మాట్లాడుతుండటం, అన్నిటికీ మించి ప్రతిపక్షాలను రాజకీయంగా వేధించడం… ఇవే కనిపిస్తున్నాయి.

నిజానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తెలంగాణ దిగువన ఉన్నప్పటికీ, ఏపీలో మంచి సాగునీటి వసతి సౌకర్యం ఉంది. సారవంతమైన వ్యవసాయ భూములు, అనుభవజ్ఞులైన రైతన్నలు ఉన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం పోలవరంతో సహా ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టును పూర్తిచేయలేకపోయింది. కానీ రైతులకు సంక్షేమ పధకాలు ఇచ్చి ఉద్దరించామని చెప్పుకొంటోంది.

తెలంగాణతో సహా దేశంలో అనేక రాష్ట్రాలలో మన రాష్ట్రానికే చెందిన పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలు, చివరికి తెలుగు సినీ పరిశ్రమలోవారు గొప్ప పేరు తెచ్చుకొంటున్నారు. కానీ సొంతరాష్ట్రమైన ఏపీలో పరిశ్రమలు, కాంట్రాక్టులు, వ్యాపారాలు, సినిమాలు చేసేందుకు సాహసించలేకపోతున్నారు… ఎందుకు? వైసీపీ ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమను కూడా రాజకీయ కోణంలో నుంచే చూస్తూ వేధిస్తుండటం వలన సిఎం జగన్‌ స్వయంగా అభ్యర్ధించినా సినీ పరిశ్రమ ఏపీకి వచ్చేందుకు సాహసించడం లేదు.

ఏపీకి కొత్తగా వచ్చిన పరిశ్రమలను వేళ్ళపై లెక్కించవచ్చునేమో కానీ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినవాటిని, రాష్ట్రానికి రాకుండా ఆగిపోయినవాటిని లెక్కించడం కష్టం. గమ్మతైన విషయం ఏమిటంటే వైసీపీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తామని ఆహ్వానిస్తుంటే, వైసీపీ నేతలు వాటిని వేధిస్తుంటారు. ఇవి కాక, విద్యుత్‌ కోతలు, భారీగా విద్యుత్‌ ఛార్జీలు, పన్నులు వంటివన్నీ పారిశ్రామికవేత్తలు ఏపీ నుంచి పారిపోయేలా చేస్తున్నాయని చెప్పొచ్చు.

తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు, వాణిజ్య సంస్థల జోలికి మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైనా వెళ్ళిన్నట్లయితే, సిఎం కేసీఆర్‌ వారిని ఒక్క నిమిషం కూడా ఉపేక్షించరు. అందుకే తెలంగాణకు పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు, పెట్టుబడులు ప్రవాహంలా తరలివస్తున్నాయి.

హైదరాబాద్‌లోపరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు, వాణిజ్య సంస్థలు ఉన్నా ఆ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ నేటికీ విదేశాలలో పర్యటిస్తూ ఇంకా ఇంకా సాధించుకొస్తూనే ఉన్నారు. కానీ ఈవిషయంలో కూడా మన ప్రయత్నలోపం కళ్ళకు కట్టిన్నట్లు కనిపిస్తోంది.

ఇంకా సంస్కరణల పేరుతో విద్యావిధానంపై వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయోగాలు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఆందోళనలు, నానాటికీ పెరిగిపోతున్న అప్పులు, ఆ కారణంగా ప్రజలపై నానాటికీ పెరుగుతున్న ఆర్ధికభారం, అమరావతా- మూడు రాజధానులా అనే సందేహం, ముఖ్యంగా రాజకీయ అనిశ్చిత, రాజకీయ అరాచకం, విధానపరమైన నిర్ణయాలను రాజకీయాలతో ముడిపెట్టి అమలుచేస్తుండటం వంటి సకల అవలక్షణాలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని క్రుంగదీస్తున్నాయని చెప్పక తప్పదు.

ఒకవేళ ప్రభుత్వం మారినా ఈ సమస్యలన్నిటినీ అధిగమించి, పరిస్థితులలో మార్పు తీసుకురావడానికి చాలా సమయమే పడుతుంది. కనుక ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్ ఆగమ్యగోచరంగానే కనిపిస్తోందని చెప్పక తప్పదు.