YS Jagan Mohan Reddyచంద్రబాబు నాయుడు ఆరోపించినట్టుగానే జరిగింది. జగన్ ను కేసుల నుండి కాపాడటానికే కంగారుగా హై కోర్టు విభజన చేశారు అన్న చంద్రబాబు నాయుడు ఆరోపణ నిజమే అన్నట్టుగా ఆస్తుల కేసులో జగన్‌ దాఖలు చేసిన డిశ్చార్జ్‌ పిటిషన్లపై సీబీఐ కోర్టు విచారణ మళ్ళీ మొదటికి వచ్చింది. రెండున్నరేళ్లుగా వీటిపై విచారణ కొనసాగుతుండగా న్యాయమూర్తి బదిలీతో వాదనలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. దీంతో ఈ కేసు మొదటికి వచ్చినట్లయింది. ఇప్పటివరకు జగన్‌ ఆస్తుల కేసులో మొత్తం 11 అభియోగపత్రాలను సీబీఐ నమోదు చేసింది.

నేరానికి ఎలాంటి సంబంధం లేకుండానే తమపై అక్రమంగా కేసులు బనాయించారు కాబట్టి ఎఫ్‌ఐఆర్, ఛార్జిషీట్ల నుంచి తమను తప్పించాలని నిందితులుగా ఉన్నటు వంటి జగన్మోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, మిగతా నిందితులు డిశ్చార్జ్‌ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై గత కొంతకాలంగా వాదనలు కొనసాగుతున్నాయి. మొత్తం 11 కేసులకు గానూ 4 కేసుల్లో వాదనలు పూర్తయ్యాయి. రెండున్నరేళ్లుగా ఇది కొనసాగుతోంది. ఇప్పటిదాకా వాదనలు విన్న సీబీఐ కోర్టు న్యాయమూర్తి వెంకట రమణను ఏపీకి కేటాయించడంతో బదిలీ అయ్యారు.

కొత్తగా వచ్చే న్యాయమూర్తి డిశ్చార్జ్‌ పిటిషన్లపై మళ్లీ వాదనలు వినాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో డిశ్చార్జ్‌ పిటిషన్లపై మళ్లీ వాదనలు జరగనున్నాయి. అందుకు మరికొన్నేళ్లు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో జగన్ కు రాజకీయంగా వెసులుబాటు కూడా కలిగినట్టు అయ్యింది. మరోవైపు సీబీఐ ఈడీ కోర్టులో జగన్‌ ఆస్తుల కేసు శుక్రవారం విచారణకు రాగా.. తదుపరి విచారణ ఈ నెల 25కి వాయిదా పడింది. జగన్ పాదయాత్ర ఈ నెల 9న పూర్తి కాబోతుంది. దీనితో పాదయాత్ర జరుగుతుండగా జగన్ చివరి కోర్టు హాజరు ఇదే.