YS Jagan Press Meetఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మండిపడం కొత్తేమీ కాదు. అయితే ఈ సారి దానికి కారణంగా ముద్రగడ పద్మనాభం ఉదంతాన్ని ఎంచుకున్నారు. ముద్రగడను మరియు అమాయకంగా అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని, అలాగే ఎన్నికల హామీలలో తను ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేసారు.

అయినా సిఐడి అనేది రాష్ట్ర స్థాయి పరిధిలో ఉండేదని, అధికారం అంతా తమ చేతుల్లో పెట్టుకుని విచారణ జరిపించారని, కేసును సీబీఐకు అప్పగించాలని, “సీబీఐ వాళ్ళయితేనే నిజాయితీగా కేసులు పెడతారు” అంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబుకు నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే ముద్రగడతో అందరినీ విడుదల చేసి కేసులో సీబీఐ విచారణ జరిపించాలని, అప్పుడు చంద్రబాబు హస్తం ఉందని తెలిసినా గానీ, చంద్రబాబుపై కూడా కేసులు పెడతారంటూ వ్యాఖ్యానించారు. ఇవన్నీ స్వయంగా జగన్ గారి నోట నుండి సీబీఐ వారిపై జాలువారిన పలుకులు.

ఒక్కసారి సీన్ కట్ చేసి, ఫ్లాష్ బ్యాక్ కు వెళితే… అక్రమాస్తుల కేసులలో తనపై వరుసగా చార్జీషీట్లు నమోదవుతున్న సందర్భంలో ఇదే ‘సీబీఐ’ను… ఇదే జగన్ గారు… ఏ విధంగా అభివర్ణించారో అందరికీ తెలిసిన విషయమే. కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి సీబీఐ వెళ్ళిపోయిందని, సీబీఐ విచారణ మీద ప్రజలు నమ్మకం కోల్పోయేలా సాగుతోందని… ఇలా ఒకటేమిటి… సీబీఐ పేరును కూడా వివిధ రకాలుగా విశ్లేషణ చేసిన సందర్భాలు కోకొల్లలు.

మరి తాజాగా అదే సీబీఐకు ముద్రగడ కేసును అప్పగించాలి… “సీబీఐ వాళ్ళయితేనే నిజాయితీగా కేసులు పెడతారు” అంటూ వ్యాఖ్యానించడం… తన స్వార్ధ రాజకీయ లబ్ధి కోసం జగన్ ఎలాంటి వ్యాఖ్యలైనా చేస్తారనడానికి నిదర్శనంగా విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మరో విశేషమేమిటంటే… రెండు రోజుల క్రితం చంద్రబాబుపై ముద్రగడ ఎలాంటి ఆరోపణలైతే చేసారో… పదాలు మారినా, కాస్త అటుగా ఇటుగా అదే భావనలను జగన్ గారు వ్యక్తపరిచారు. మరి ఎవరి వెనుక ఎవరు ఉన్నారో… ఎవరి ముందు ఎవరు ఉన్నారో గానీ… రాష్ట్రం ఉన్న స్థితిని ఈ ‘కుటిల రాజకీయం’ మరింతగా దిగజార్చేలా చేస్తోందన్నది మాత్రం నిజం.