YS Jagan Mohan Reddy class to all MLas     సిఎం జగన్మోహన్ రెడ్డి నిన్న తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు మళ్ళీ క్లాసు పీకారు. “ఎంత కష్టంగా ఉన్నా నేను బటన్ నొక్కుతూనే ఉన్నాను… సమయానికి నిధులు విడుదల చేస్తూనే ఉన్నాను. కానీ మీరు గడప గడపకి ప్రభుత్వం కార్యక్రమంలో చురుకుగా పాల్గొనడం లేదు. నేను నిధులు విడుదల చేస్తున్నయ మీరు ప్రజల వద్దకు వెళ్ళి వాటి గురించి చెప్పడానికి ఏమిటి కష్టం?నాకు ఎన్ని పనులున్నా నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. నిత్యం ప్రజల మద్యనే ఉంటున్నాను. కానీ మీరు ప్రజల మద్యకు వెళ్ళడం లేదు.

ఈ కార్యక్రమం ప్రారంభించి నెల రోజులుపైనే అవుతున్నా కొందరు ఒక్కసారి కూడా దీనిలో పాల్గొనలేదు. కొందరు ఒకటి రెండు సార్లు వెళ్ళి మమ అనిపించేశారు. కొందరు 4-5 సార్లు మాత్రమే వెళ్ళారు. ఒకరిద్దరు మాత్రమే చిత్తశుద్ధితో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనం అందరం కలిసి కష్టపడితే సులువుగా మళ్ళీ అధికారంలోకి రాగలము. ఎదురుగా ఉన్న ఈ అవకాశాన్ని కూడా మనం ఉపయోగించుకోలేకపోతే ఎలా?

ప్రతీ ఎమ్మెల్యే నెలకు 15-20 రోజులు తప్పనిసరిగా ప్రజల మద్యలో ఉంటూ మన ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పధకాల గురించి చెపుతూ వారితో మమేకం కావాలి. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదు. నేను ప్రతీ సచివాలయానికి రూ.20 లక్షలు మంజూరు చేశాను. మీరు చేయవలసినదల్లా దాని పరిధిలోని ప్రాంతాలలో పర్యటించి ప్రజాసమస్యలు తెలుసుకొని ప్రాధాన్యతా క్రమంలో ఏఏ పనులు చేయాలో గుర్తించి అధికారులను ఆదేశించడమే. ఇంత చిన్న పని కూడా చేయకపోతే ఎలా?ఇప్పుడు నేను ఎవరినీ గట్టిగా మందలించడం లేదని లైట్ తీసుకోవద్దు. కష్టపడి పనిచేయనివారికి టికెట్స్ ఇవ్వను. అప్పుడు బాధపడినా ప్రయోజనం ఉండదు,” అని అందరికీ వార్నింగ్ ఇచ్చారు.

సిఎం జగన్ బటన్ నొక్కి టంచనుగా పధకాలకు నిధులు విడుదల చేస్తున్నా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల మద్యకి వెళ్ళడం లేదని వారిపై చిందులు వేయడం కంటే అసలు వారు ప్రజల మద్యకు వెళ్ళడానికి ఎందుకు భయపడుతున్నారు?అని ఒకే ఒక ప్రశ్న అడిగి ఉంటే వారే సరైన సమాధానం చెప్పేవారు. కానీ వారిని ఆ ఒక్క ప్రశ్న అడగకుండా నేను బటన్ నొక్కుతా.. మీరు తిరుగుతుండాలి… లేకుంటే టికెట్లు ఇవ్వనని బెదిరిస్తుండటంతో వారి పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారైంది. జగనన్నను ప్రజలే భరిస్తున్నప్పుడు పదవులు, అధికారం పొందిన మంత్రులు, ఎమ్మెల్యేలు భరించకతప్పదు కదా?