AP CM Jagan on 3 Capitalsముఖ్యమంత్రిగా జగన్ తీసుకున్న ప్రతిష్టాత్మకమైన నిర్ణయం ‘మూడు రాజధానుల బిల్లు’ రద్దయ్యింది. అసెంబ్లీ వేదికగా ఆర్ధిక శాఖా మంత్రి వర్యులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ బిల్లు రద్దును సభలో ప్రవేశపెట్టారు. తదుపరి ముఖ్యమంత్రి జగన్ ఈ బిల్లును వెనక్కి తీసుకున్నట్లుగా ప్రకటించారు.

అయితే దీనికి గల కారణాలను చెప్పిన తీరు మరింత హాస్యాస్పదంగా ఉన్నాయని పొలిటికల్ వర్గాల్లో విశ్లేషణలు మొదలయ్యాయి. రాజధాని నిర్మాణం కోసం అప్పటి ప్రభుత్వం వేసిన లెక్కల ప్రకారం దాదాపుగా లక్ష కోట్లు ఖర్చవుతుందని, అది ఏ విధంగా సాధ్యం కాని విషయమని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్ స్పష్టం చేసారు.

అదే మరో పదేళ్లు గడిస్తే ఈ లక్ష కోట్ల విలువ మరో ఆరేడు లక్షలు అవుతుందని, ఏ రకంగానూ ఈ ప్రాంతంలో రాజధాని నిర్మాణం సాధ్యం కాదని తెలిపారు. కనుక ఇప్పటికే మౌలిక వసతులు కలిగి ఉన్న విశాఖను ఒక రాజధానిగా ఎంపిక చేశామని, సుందరీకరణ మరియు ఆధునీకరణకు కాస్త ఖర్చు పెడితే సరిపోతుందని అన్నారు.

పరోక్షంగా అయినా… ప్రత్యక్షంగా అయినా… కొత్తగా రాజధాని నిర్మించడం ముఖ్యమంత్రిగా తన వలన సాధ్యం కాదని ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు చెప్పినట్లుగా పొలిటికల్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. రాష్ట్రంలో ఉన్న ఆదాయ వనరులన్నీ సంక్షేమ పధకాలకు తరలించడమే ఇందుకు ప్రధాన కారణమనేది పొలిటికల్ టాక్.