ys- jagan mohan reddyవైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర ఇక నాలుగు రోజులలో ముగుస్తుంది అనగా ఆ పార్టీకి పెద్ద విజయం లభించింది. జగన్ పై జరిగిన కోడి కత్తి కేసును కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న సంస్థకు అప్పగించాలన్న జగన్ డిమాండ్ తో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏకీభవించింది. కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు వెలువరించింది. జగన్‌పై దాడి కేసులో రాష్ట్ర ప్రభుత్వం సరిగా దర్యాప్తు చేయలేదని జగన్ ఆరోపణ.

అయితే రాష్ట్ర ప్రభుత్వం చిత్త శుద్ధిపై ఎటు వంటి కామెంట్ చేయ్యకుండా దాడి జరిగిన ప్రదేశం (విమానాశ్రయం లాంజ్‌) కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది కాబట్టి జాతీయ సంస్థలకు ఇవ్వొచ్చని భావించిన ధర్మాసనం.. కేసును ఎన్‌ఐఏకు అప్పగించింది. ఇప్పటికే విశాఖపట్నం పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేసి నిందితుడిని విచారించింది, పూర్తి స్థాయిలో కేసు విచారణ జరిగింది. అయినా కేసును ఎన్‌ఐఏకు అప్పగించేందుకే ధర్మాసనం మొగ్గు చూపింది.

అయితే ఈ కేసును ఎన్‌ఐఏకు హైకోర్టు తీర్పుకు ముందే కేంద్ర ప్రభుత్వం ఈ కేసులో ఎన్‌ఐఏకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు ఈ నెల ఒకటో తేదీ సాయంత్రమే ఎన్‌ఐఏ హైదరాబాద్‌ విభాగం ఈ కేసుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. సీఐఎస్‌ఎఫ్‌ అసిస్టెంట్‌ కమాడెంట్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసింది. కేసు నమోదు చేసిన విషయాన్ని ఏపీ హైకోర్టుకు కేంద్రం ప్రభుత్వం తెలిపింది.నిందితుడు జగన్ అభిమాని అని కేవలం ప్రచారం కోసమే ఈ దాడికి ఒడిగట్టాడని ప్రాధమికంగా నిర్ధారించారు విశాఖ పోలీసులు.

ఇప్పుడు ఎన్‌ఐఏ ఈ కేసును పూర్తి స్థాయిలో మొదటి నుండీ విచారణ చేయబోతుంది. ఎన్‌ఐఏ విచారణలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టు కుట్ర కోణం ఏదైనా బయటపడుతుందేమో చూడాలి. మరో వైపు ఈ కేసు పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తుంది. మరోవైపు ప్రస్తుతం శ్రీకాకుళంలో జరుగుతున్న జగన్ పాదయాత్ర ఈ నెల 9వ తారీఖుతో పూర్తి కాబోతుంది. ఇచ్ఛాపురంలో భారీ బహిరంగసభతో పాదయాత్రకు ముగింపు చెప్పబోతున్నారు జగన్. ఈ సభకు భారీ ఏర్పాటు చేస్తున్నాయి వైకాపా వర్గాలు.