Pawan Kalyan and Jagan on new districtsజగన్ కొత్త జిల్లాల ప్రకటనతో విభేదించిన జనసేన పవన్ కళ్యాణ్ గిరిజనుల గోడుని ప్రభుత్వానికి వినిపించారు. పోలవరం నిర్వాసితుల ఆవేదనను ప్రభుత్వం అర్ధం చేసుకొని జిల్లాల విభజన చేసుంటే బాగుండేదని., ఈ ప్రాంతం వారు జిల్లా కేంద్రాలకు వెళ్లాలంటే కనీసం మూడు వందల కిలోమీటర్లు ప్రయాణించి రావాల్సి వస్తుందని ఆ మాత్రం ఆలోచన లేకుండా విభజన చేస్తే ఎట్లా? అంటూ పవన్, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ప్రభుత్వం వెంటనే వారి సమస్యను పరిష్కరించాలని., లేని పక్షంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పొరపాటుని సరిదిద్దుతామని అక్కడి ప్రజలకు పవన్ భరోసా కల్పించారు. ఈ పత్రిక ప్రకటన ద్వారా వెలువడిన ‘ప్రశ్న’కు విడుదలైన 24గంటలలోనే ప్రభుత్వం నుండి సమాధానం దొరికింది గిరిజన ప్రాంత ప్రజలకు.

మాజీ కాబోతున్న మంత్రి పేర్ని నాని ఈ విషయం పై స్పందించారు. పోలవరం ముంపు ప్రాంతాలైన రంపచోడవరం, చింతూరు వంటి గిరిజన ప్రాంతాలు జిల్లా కేంద్రాలకు అత్యంత దూరంలో ఉండటం వలన ఆ ప్రాంత ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి జగన్ మరో కొత్త జిల్లా ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారని., అయితే ఆ జిల్లా కూడా గిరిజన ప్రాంతంలోనే భాగమవుతుందని ‘సమాధానం’ ఇచ్చారు.

ప్రభుత్వంలో కదలికను తీసుకువచ్చి., ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రతిపక్షాల పాత్ర కీలకం అంటే ఇదేనేమో అంటున్నారు నిర్వాసితులు. అయితే ప్రభుత్వ ఆలోచన సరళిని బట్టి ‘ప్రతిపక్షాల – గెలుపుగా’ దీనిని అభివర్ణిస్తే మాత్రం ‘గిరిజనుల – ఓటమి’ ఖరారైనట్లే భావించాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.