Jagan comes unprepared to Assemblyఇటీవల కాలంలో అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగాడమంటే సాధారణ విషయం కాదు. ప్రజాధనాన్ని వృధా చేయడానికి ప్రజాప్రతినిధులంతా కలిసి కష్టపడుతున్న వైనాన్ని ప్రజలు టీవీలలో ప్రత్యక్షంగా తిలకిస్తూనే ఉన్నారు. అయితే అసెంబ్లీ సమావేశాలు అనగానే మొదటగా గుర్తుకు వచ్చేలా జగన్ తన గుర్తింపును చాటుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

గత రెండు, మూడు అసెంబ్లీ సమావేశాలను గమనిస్తే… అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య కొట్లాటకు, తిట్లకు అసెంబ్లీ వేదిక అవుతోంది. ఏమీ లేని ప్రతిపక్ష పార్టీనే ఒక రేంజ్ లో రెచ్చిపోతుంటే, ప్రజల చేత గెలిచి అధికారంలో ఉన్న తమకు ఇంకెంత ఉండాలనే విధంగా సాగుతున్న పోరు మధ్య ప్రతిపక్ష పార్టీ అవలంబిస్తున్న ఒక విధంగా స్పష్టంగా కనపడుతోంది. అసెంబ్లీ సమావేశాలలో ఏ అంశానికి ఎంత సమయం కేటాయించాలి, అసలు ఏయే అంశాలు ప్రస్తానకు తేవాలి, వాటిపై ఎంతసేపు విశ్లేషణ చేయాలి, ఒక్కో పార్టీకి ఎంతెంత సమయం కేటాయించాలి… అనే ముఖ్యమైన చర్చ బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ)లో నిర్ణయింపబడుతుంది.

ఈ బీఏసీ సమావేశానికి ప్రతిపక్ష పార్టీ అధినేత జగన్ ఎప్పుడూ హాజరు కారు. తన పార్టీ ముఖ్య నేతలైన శ్రీకాంత్ రెడ్డి తదితరులను పంపిస్తారు. బీఏసీలో అధికార ప్రతిపక్ష సభ్యులిద్దరూ కూర్చుని ఒక నిర్ణయం తీసుకుని అసెంబ్లీ సమావేశాలను ప్రారంభిస్తారు. అసలు ‘ట్విస్ట్’ ఇక్కడే ఉంది. బీఏసీలో కేటాయించిన విధంగా సమయ పాలనపై స్పీకర్ ఒక ప్రకటన చేయగానే ప్రతిపక్ష నేత జగన్ టక్కున లేచి… “మాకు అన్యాయం జరిగింది, మీరు కేటాయించిన సమయం మాకు సబబు కాదు” అంటూ గందరగోళం సృష్టిస్తారు. అయితే ప్రభుత్వం మాత్రం బీఏసీలో మీ పార్టీ సభ్యులే ఒప్పుకున్నారు అని ఎంత వారించినా వినని జగన్, సభను వాయిదా వేసే వరకు తన పార్టీ సభ్యుల చేత నినాదాలు చేయిస్తారు.

సభ వాయిదా పడి, మళ్ళీ ప్రారంభం అయినప్పటికీ తీరు మారదే. తానూ పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్న చందంగా… ఓ పట్టు పట్టి మళ్ళీ సభ వాయిదా వేసే వరకు సాగదీస్తారు. పొరపాటున ఏదైనా అంశంపై చర్చ గనుక ప్రారంభం అయితే… ఇక జగన్ విశ్వరూపానికి తెరలేపినట్లే. ప్రత్యర్ధి నాయకులు మండిపడేలా పౌరుష పదజాలంతో స్పందించి, ప్రత్యర్ధి రాజకీయ నాయకులను రెట్టించి సభ వాయిదా వేయించుకోవడం మరో పధ్ధతి. ఇలా రూటు ఏదైనా జగన్ దారి ఒక్కటే అనే విధంగా… కారణాలు ఏవైనా సభ వాయిదా పడే వరకు జగన్ సభలో గందరగోళం సృష్టించడం పరిపాటిగా మారింది. బీఏసీ సమావేశానికి హాజరై, స్వయంగా జగనే నిర్ణయం తీసుకోవచ్చు కదా అంటారేమో… అలా అయితే సభ సజావుగా సాగిపోతుంది కదా..! అదే జగన్ వ్యూహం..!