YS Jagan Mohan Reddy Amma Vodiనవరత్నాలలో ఒకటైన కీలక పథకం ‘అమ్మ ఒడి’ పై ముఖ్యమంత్రి కార్యాలయం క్లారిటీ ఇచ్చింది. పేద తల్లులు తమ పిల్లల్ని ఏ బడికి పంపినా వారికి ఈ పథకం ద్వారా లబ్ది చేకూరుస్తామని పేర్కొంది. పాదయాత్రలో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీని అనుసరించి ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే విద్యార్థుల తల్లులకు అమ్మ ఒడి వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ కార్యక్రమంలో ఎలాంటి సందేహాలు, అపోహలకు తావు లేదని పిల్లల్ని బడికి పంపే ప్రతీ తల్లికి ఈ పథకం వర్తిస్తుందని సీఎంఓ స్పష్టం చేసింది.

గత కొన్ని రోజులుగా ఈ పథకంపై చర్చ జరుగుతుంది. ప్రైవేట్ పాఠశాలలకు కూడా పథకం వర్తింపచేస్తే గవర్నమెంట్ బడులలో చేర్పించే వారు కూడా ఉండరని ఆరోపణ. దీనివల్ల గవర్నమెంట్ బడులు మూతపడే అవకాశం ఉంటుందని నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు నిబంధన మారిస్తే రాజకీయంగా నష్టపోతామని ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే కొన్ని ప్రైవేట్ స్కూళ్ళు ఈ పథకాన్ని ప్రచారం చేసుకుంటున్నాయి.

గతంలో ఫీజు రీయింబర్సుమెంట్ పేరుతో అప్పటి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పథకం తెచ్చినప్పుడు. రాష్ట్రంలో పుట్టగొడుగులుగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజిలు పుట్టుకుని వచ్చాయి. విద్య నాణ్యత తగ్గి నిరుద్యోగులు పెరిగిపోయారు. అదే విధంగా ఆరోగ్యశ్రీతో ప్రభుత్వ ఆసుపత్రులను నిర్లక్ష్యం చేసి ప్రైవేట్ ఆసుపత్రులకు కోట్లు ధారబోశారు. ఇప్పుడు ఈ పథకం వల్ల స్కూల్ విద్య కూడా అలాగే తయారయ్యే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.