ys jagan mohan reddy amaravathi issueకేంద్రంలో, రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా ఆంధ్రప్రదేశ్‌ ఎప్పుడూ కేంద్రానికి అండగా నిలబడుతూనే ఉంది. రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌ తీవ్రంగా నష్టపోయినప్పటికీ ఏపీని గతంలో పాలించిన టిడిపి, ఇప్పుడు పాలిస్తున్న వైసీపీ కేంద్రానికి అండగానే నిలబడ్డాయి. కానీ ఏపీ అండదండలు పొందుతున్నాప్పటికీ కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూనే ఉన్నాయనేది చేదు నిజం. ఒకప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడూ ఇదే పరిస్థితి. ఇప్పుడు వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడూ ఇదే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్‌ అంటే కేంద్రప్రభుత్వానికి అంత చులకన ఎందుకో అర్ధం కాదు.

ఆనాడు అమరావతికి శంకుస్థాపన చేసేందుకు ప్రధాని నరేంద్రమోడీని ఆహ్వానిస్తే ఆయన చెంబుడు పవిత్ర జలాలు తెచ్చి నాటి సిఎం చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టి వెళ్ళిపోయారు. రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు అవసరం అని చెపితే పదివేల కోట్లు వాయిదాల పద్దతిలో ఇచ్చి చేతులు దులుపుకొంది. ఏపీ అంటే అంత చులకన!

అయినప్పటికీ చంద్రబాబు నాయుడు పట్టు వదలని విక్రమార్కుడిలా రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులు రాజధాని నగరమే స్వయంగా సమకూర్చుకొనేలా చక్కటి ప్రణాళికలను అమలుచేస్తూ యుద్ధ ప్రాతిపదికతో పనులు చేయించారు.

ఆ తరువాత కధ అందరికీ తెలిసిందే. మూడేళ్ళుగా జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు పాచిపాట పాడుతుంటే కేంద్రప్రభుత్వం ఏనాడూ వద్దని చెప్పలేదు. పైగా జోక్యం చేసుకోబోము అని చెప్పి పరోక్షంగా జగన్ నిర్ణయాన్ని సమర్ధించింది. బహుశః వైసీపీ ఎంపీల మద్దతు అవసరం ఉంది కనుకనే ఆవిదంగా వ్యవహరించిందని వేరే చెప్పక్కరలేదు.

దీంతో ఆంధ్రప్రదేశ్‌ మూడేళ్ళ విలువైన కాలాన్ని, అమరావతి మీద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెట్టిన డబ్బు, శ్రమ, ప్రణాళికలు అన్ని వృధా అయిపోయాయి. రాజధాని లేకపోగా వైసీపీ ప్రభుత్వం పాడుతున్న మూడు రాజధానుల పాటతో రాష్ట్రానికి రావలసిన పెట్టుబడులు హైదరాబాద్‌కు తరలిపోయాయి. అది ఎన్నటికీ తీరని మరో నష్టం.

రాజధాని విషయంలో జోక్యం చేసుకోబోమని తెగేసి చెప్పిన బిజెపి ఎట్టకేలకు అమరావతినే రాజధానిగా పరిగణించాలని ప్రత్యక్షంగా, పరోక్షంగా నొక్కి చెప్పింది. హైకోర్టు కూడా జగన్ ప్రభుత్వానికి పదేపదే మొట్టికాయలు వేస్తుండటంతో అయిష్టంగానే పనులు ప్రారంభించారు.

అమరావతి విషయంలో బిజెపి అధిష్టానం వైఖరి స్పష్టమైంది కనుక ఆ పార్టీ ఎంపీ జీవిఎల్ నరసింహారావు శనివారం అమరావతిలో పటించి అక్కడ జరిగిన అభివృద్ధి పనులను, నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “చంద్రబాబు నాయుడును రాజకీయంగా దెబ్బ తీసేందుకే సిఎం జగన్మోహన్ రెడ్డి అమరావతి నిర్మాణ పనులు నిలిపివేసి మూడు రాజధానుల పాట పాడారు. రాజకీయాల కోసం అమరావతిని బలి పెట్టడం సరికాదు. మా పార్టీ అమరావతికే కట్టుబడి ఉందని ఇదివరకే చెప్పాము. హైకోర్టు కూడా అమరావతిలో పనులు మొదలుపెట్టాలని గట్టిగా చెప్పింది. కనుక ఇకనైనా సిఎం జగన్మోహన్ రెడ్డి తన మొండి వైఖరిని విడనాడి అమరావతిలో నిర్మాణ పనులు మొదలుపెడితే రాష్ట్రాభివృద్ధికి అది ఎంతో దోహదపడుతుంది,” అని అన్నారు.

ఇప్పుడు బిజెపి ఎంపీ చెప్పిన మాటలనే మూడేళ్ళ క్రితం చంద్రబాబు నాయుడు చిలక్కి చేపినట్లు సిఎం జగన్మోహన్ రెడ్డికి, కేంద్రానికి కూడా చెప్పారు. కానీ పట్టించుకోలేదు. సరే.. వైసీపీ పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు కనుక క్షమించవచ్చు. కానీ మూడేళ్ళుగా రాష్ట్రం నష్టపోతోందని తెలిసినా కేంద్రప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు?ఇదే ముక్క ఆనాడే ఎందుకు చెప్పలేదు?

సిఎం జగన్మోహన్ రెడ్డికి సుద్దులు చెప్పిన బిజెపి కూడా తన రాజకీయ అవసరాల కోసమే అమరవతిని మూడేళ్ళుగా బలి చేసింది కదా? ఏపీ పట్ల ఈవిదంగా వ్యవహరిస్తుంటే బిజెపిని ప్రజలు ఎందుకు ఆదరిస్తారు?ఆనాడు రాష్ట్రాన్ని బలవంతంగా విడదీసినందుకు ఏపీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేశారని బిజెపి ఇంత తొందరగా ఎలా మరిచిపోగలిగింది? కనుక ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం చొరవ తీసుకొని అమరావతిని యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం జరిగేలా చేయగలిగితే రాష్ట్రంలో బిజెపికే కొంతైనా మేలు కలుగుతుంది లేకుంటే కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే బిజెపికి పట్టవచ్చు.