అధికారం చేతికి వచ్చి రెండున్నర్రేళ్లు పూర్తయినా, ఇంకా గత ప్రభుత్వం పైన నిందలు వేసే పనిలో వైసీపీ సర్కార్ ఉండడం రాజకీయ వర్గాలలో శోచనీయంగా మారింది. ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్న టాక్ రాజకీయ నేతల నుండి సామాన్య ప్రజల వరకు వెళ్లిపోవడంతో… దానికి కారణం చంద్రబాబు ప్రభుత్వమే అంటూ చెప్పే ప్రయత్నం చేసారు వైఎస్ జగన్.

“గత ప్రభుత్వం చేసిన అధిక రుణాలకు మా బాధ్యత లేకపోయినప్పటికీ, ఇలా చేయడం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కేంద్ర ఆర్ధిక శాఖ సమ్మతించలేదు, పైగా రుణ పరిమితిలో కోతను ఏకంగా మరో మూడేళ్లకు విస్తరించింది” అంటూ వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను సాక్షి తన సోషల్ మీడియాలో ఖాతాలో ప్రచురించింది.

ఈ ట్వీట్ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిది చిన్న పిల్లల మనస్తతత్వం మాదిరి ఉందని వాపోతున్నారు. ‘చిన్న పిల్లలు ఆ చాక్లేట్ నాది, ఈ చాక్లేట్ నీది’ అన్న రీతిలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్, ‘ఆ అప్పులు చంద్రబాబువి, ఈ అప్పులు నావి’ అనే విధంగా మాట్లాడడం అనేది హాస్యాస్పదంగానూ, ఆశ్చర్యంగానూ ఉన్నాయనేది సోషల్ మీడియా టాక్.

ప్రభుత్వం అనేది ఒక నిరంతర ప్రక్రియ. కనీసం ఆ మాత్రం అవగాహన కూడా లేకుండా జగన్ పాలన చేస్తున్నారా? అన్న ప్రశ్నలు ఈ సందర్భంగా పొలిటికల్ వర్గాల్లో ఉత్పన్నమవుతున్నాయి. ఒకవేళ జగన్ చెప్పినట్లు “చంద్రబాబు హయాంలో అప్పులు – జగన్ హయాంలో అప్పులు” అని విభజించినా… చంద్రబాబుకు అందనంత ఎత్తులో జగన్ ఉన్నారనేది లెక్కలే చెప్తున్నాయి.