YS-Jagan- Fake Person2019 ఎన్నికలలో విజయం సాధించడానికి నాటి ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి ఎన్ని అసత్యపు హామీలను గుప్పించారో, అలాగే నాటి అధికార పక్ష పార్టీ తెలుగుదేశం పైన ఎన్ని అబద్ధాలను ప్రచారం చేసారో, నేడు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయని టీడీపీ వర్గీయులు సోషల్ మీడియా వేదికలుగా మొరపెట్టుకుంటున్న విషయం.

రాష్ట్రానికి అత్యంత కీలకమైన స్పెషల్ స్టేటస్ మొదలుకుని దాదాపుగా అన్ని విషయాలలో అసత్యాలను ప్రజలకు చెప్పడంతో పాటు, అధికారంలోకి వస్తే వీటిని తమ ప్రభుత్వం కేంద్రం మెడలు వంచి మరీ తీసుకు వస్తామని నాడు గొంతు చించుకుని చేసిన ప్రచారమంతా, మూడేళ్లు గడిచిపోయే పాటికి అబద్దంగా తేలిపోయిందని టీడీపీ విమర్శిస్తోంది.

అలాగే ‘అబద్ధాలు బద్దలు’ అంటూ ప్రముఖ దినపత్రిక కూడా తమ పతాక శీర్షికలతో ముద్రించడంతో, ప్రస్తుతం “వైఎస్ జగన్ ఫేక్” అనే ట్యాగ్ సోషల్ మీడియాలో విస్తృతంగా సందడి చేస్తోంది. విశేషం ఏమిటంటే… అధికారానికి ముందు టీడీపీపై చేసిన ఆరోపణలపై ఆర్టీఐ చట్టం క్రింద సమాధానం అడుగగా, ప్రస్తుత అధికార పార్టీనే వాటికి వివరణ ఇస్తూ, ఆనాడు చేసింది ఫేక్ ఆరోపణలేనని చెప్పకనే చెప్తోంది.

ప్రతి నెలా ఒకటవ తేదీన ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ లెక్కలలోని బొక్కలు అసెంబ్లీ సాక్షిగా వెలుగు చూడడంతో పత్రికలకు కూడా అవకాశం చిక్కినట్లయ్యింది. టీడీపీ హయాంలో కేవలం 39 లక్షల మందికే పెన్షన్లు ఇచ్చిందని, తమ ప్రభుత్వం వచ్చాక ఆ సంఖ్య 51 లక్షలకు చేరిందని స్వయంగా సీఎం జగన్ వివిధ సందర్భాలలో చేసిన వ్యాఖ్యలు సత్యదూరమని అసెంబ్లీలో స్పష్టమైంది.

టీడీపీ హయాంలో చివరగా 51,66,732 పెన్షన్లను పంపిణీ చేసిందని, స్వయంగా సర్కారే వివరణ ఇవ్వడంతో జగన్ ఫేక్ ప్రచారం బయటపడింది. డీఎస్పీ పదోన్నతుల విషయంలో కూడా కుల వివక్షలను చూపుతూ నాడు వైసీపీ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఇదే అసెంబ్లీ సాక్షిగా మళ్ళీ ఇదే ప్రభుత్వం ఇటీవల వివరణ ఇచ్చుకున్న విషయం తెలిసిందే.

మన కాలం సాగినంత కాలం అబద్ధాలు అమృతంలా ఉంటాయి. ప్రజల కళ్ళు గప్పిన అవే అబద్ధాలు బద్దలైతే, ప్రజలకు ముఖం చూపించుకోలేని పరిస్థితి వస్తుంది. సామాన్య ప్రజలకైతే ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయి గానీ, రాజకీయ నాయకులకు ఇలాంటి ఫీలింగ్స్ ఉండవని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంకా రెండేళ్ల సమయం ఉన్న నేపధ్యంలో… ఇంకెన్ని బయటకు వస్తాయో చూడాలి.