ys jagan mission akarshముఖ్యమంత్రి జగన్ అధికారంలో ఒక్క ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా… మరో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలను చీల్చి చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్ష హోదా లేకుండా చెయ్యడమే లక్ష్యంగా పని చేస్తున్నారని సమాచారం. టీడీపీ ఎమ్మెల్యేలు – ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్ వైఎస్సార్ కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారట.

మరో ఎమ్మెల్యే గొట్టిపాటి రవి అటుఇటుగా ఉన్నట్టుగా సమాచారం. ఇటీవలే ఎన్నికలలో టీడీపీకి 23 సీట్లు వచ్చాయి. ప్రతిపక్ష పార్టీ హోదా ఉండాలంటే కనీసం 18 సీట్లు ఉండాలి. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ నుండి జంప్ అయ్యారు. ఇంకో ముగ్గురు పోతే టీడీపీ సంఖ్యాబలం 17కు పడిపోతుంది. అప్పుడు చంద్రబాబుకు ప్రతిపక్షహోదా పోతుందని అధికారపక్షం వారి అంచనా.

అయితే ఇందులో ఒక మెలిక ఉందని నిపుణులు అంటున్నారు. “జగన్ ఎవరైనా ఎమ్మెల్యే తన పార్టీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాలని ప్రతిజ్ఞ చేశారు. దానిని నిలబెట్టుకోవడం కోసం టీడీపీ నుండి వచ్చే ఎమ్మెల్యేలను రాజీనామా చేయించకుండా…. స్వతంత్ర ఎమ్మెల్యేలుగా కొనసాగింప చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే ముగ్గురు కూడా అదే చెయ్యనున్నారు. ఇది రాజకీయ వేసుబాటే గానీ అసెంబ్లీ రికార్డుల బట్టి వీరు ఇంకా టీడీపీ ఎమ్మెల్యేలే. ఒకవేళ స్పీకర్ ని మానేజ్ చేసినా కోర్టులలో అది నిలబడే అవకాశం లేదు,” అని వారు అంటున్నారు.

“కాబట్టి ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్ళాలి… లేదా టీడీపీలోని మూడింట రెండింతల ఎమ్మెల్యేలను ఆకట్టుకుని మొత్తం పార్టీ శాసనసభా వర్గాన్నే వైఎస్సార్ కాంగ్రెస్ లో కలిపేసుకోవాలి. అటువంటి సందర్భంలో రాజీనామాలు చెయ్యాల్సిన అవసరం ఉండదు,” అని వారు వివరిస్తున్నారు.