ys jagan message to mohan babu via chevi reddy bhaskar reddyకలెక్షన్ కింగ్ మోహన్‌బాబును తిరుపతిలో శనివారం సాయంత్రం రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కలిశారు. ఇటీవల మృతి చెందిన మోహన్‌బాబు తల్లి మంచు లక్ష్మమ్మ చిత్ర పటానికి నివాళులర్పించి మోహన్‌బాబును పరామర్శించారు. ఆ తరువాత వారు మోహన్ బాబుతో దాదాపు గంట సేపు ఏకాంతంగా మాట్లాడారు. వారు ఏమి మాట్లాడి ఉంటారా అని స్థానిక ప్రజలలో ఆసక్తి ఉంది. మోహన్ బాబు కుటుంబానికి వైఎస్ కుటుంబానికి బంధుత్వం ఉంది.

వైఎస్ సోదరుడి కూతురుని మోహన్ బాబు తనయుడు విష్ణు వివాహం చేసుకున్నారు. ఒకప్పుడు టీడీపీలో ఉన్న మోహన్ బాబు ఆ తరువాతి కాలంలో ఆ పార్టీకి దూరమయ్యారు. అప్పుడప్పుడు రాజకీయాలు మాట్లాడినా మోహన్ బాబు తనకు అన్ని పార్టీలు కావాల్సినవే అంటూ అంటూ ఉంటారు. రాజకీయాలలోకి తిరిగి రావడం పైన కూడా ఆయన చాలా సార్లు నర్మగర్భమైన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆయనకు వైకాపా నుండి ఏమైనా ఆహ్వానం అందిందా అనేది సర్వత్రా మాట్లాడుకుంటున్న విషయం.

ఈ మధ్యనే మోహన్ బాబు చిన్న కుమారుడు మనోజ్ కొద్దీ రోజుల పాటు తాను సినిమాలు ఆపి తిరుపతి వెళ్ళి ప్రజా సేవ చెయ్యనున్నట్టు ప్రకటించారు. అయితే తాను రాజకీయాలలోకి వచ్చే ఉద్దేశం ఏమీ లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో మోహన్ బాబు కుటుంబం వైకాపా వైపు చూస్తుందా? ఆ క్రమంలో జగన్ మోహన్ బాబుకు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ద్వారా ఏమైనా రాయభారం పంపారా అనేది తెలియాల్సి ఉంది