YS-Jagan-Meets-Venkaiah-Naiduఅప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వెంకయ్య నాయుడు సన్నిహితంగా ఉంటారని, ఇద్దరు ఒకటే అని వైఎస్సార్ కాంగ్రెస్ అప్పట్లో పదే పదే ఆరోపించేది. ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ రాకపోవడానికి ఇద్దరూ కారణమే అంటూ జగన్ కూడా పలుసార్లు ఆరోపించే వారు. అయితే ఇప్పుడు వాతావరణం మారింది. చంద్రబాబు ప్రతిపక్షంలోకి వెళ్లారు… జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న జగన్ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వద్దకు వెళ్లి భేటీ అయ్యారు.

ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి రెండు నెలలైనా జగన్ మోహన్ రెడ్డి ఇప్పటిదాకా ఆయనను కలవలేదు. ఇప్పుడు ఉన్నఫళంగా ఆయన వద్దకు వెళ్లారు. ఇప్పుడు వీరిద్దరు కలుసుకోవడం అందరికి ఆసక్తి కలిగించింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్ సభ్యులు… విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, ఆదాల ప్రభాకర్‌ రెడ్డి, నందిగం సురేష్‌, బాల శౌరి పాల్గొన్నారు. సుమారు అరగంట పాటు ఈ సమావేశం కొనసాగింది.

రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న పలు అంశాలపై తమ వంతు ప్రయత్నం చెయ్యాలని వెంకయ్యను జగన్ కోరినట్టు సమాచారం. బీజేపీతో జగన్ మంచి సంబంధాలు కోరుకుంటున్నారు అని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీ అనంతరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌…రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌తో భేటీ అయ్యారు. ఇవాళ మధ్యాహ్నం కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. నిన్న ఆయన ప్రధానిని కలిసిన విషయం తెలిసిందే.