YSJagan-YSRCP-Kuppamఎన్నికలలో రాజకీయ పార్టీలు గెలుపు గుర్రాలను బరిలో దించుతుంటాయనేది అందరికీ తెలిసిందే. అంగబలం, అర్ధబలం, కులాల లెక్కలు, ప్రత్యర్దుల బలాబలాలు అన్నీ సరిచూసుకొన్నాక అభ్యర్ధులను ఖరారు చేస్తుంటాయి. అయితే మొదటి నుంచి రివర్స్ టెండరింగ్ పద్దతిలో రాష్ట్రాన్ని వెనక్కు నడిపిస్తున్న సిఎం జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలకు అభ్యర్ధుల ఎంపిక విషయంలో కూడా ఇదే విధానం అనుసరిస్తున్నట్లున్నారు.

టిడిపిలో అగ్రనేతలను లక్ష్యంగా చేసుకొని ముందుగా వారి నియోజకవర్గాలలో అభ్యర్ధులను ప్రకటిస్తున్నారు. మూడేళ్ళుగా సంక్షేమ పధకాల గోల తప్ప అభివృద్ధి అనే పదం కూడా పలకని సిఎం జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా ఆయా నియోజకవర్గాలలో ‘అభివృద్ధి’ చేద్దాం అని చెపుతున్నారు.

ముందుగా చంద్రబాబు నాయుడు కంచుకోట కుప్పంను బద్దలు కొట్టాలని లక్ష్యంగా పెట్టుకొన్న సిఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ్ళ కుప్పంలో వైసీపీ నేతలతో సమావేశమయ్యి భరత్‌ను అభ్యర్దిగా ప్రకటించారు.

విశేషమేమిటంటే భరత్‌ను గెలిపిస్తే అతనికి మంత్రి పదవి ఇస్తానని పార్టీ నేతలకు ఎర వేయడం. సిఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “వచ్చే ఎన్నికలలో 175 సీట్లు గెలుచుకొనే కార్యక్రమం మనం కుప్పం నుంచే మొదలుపెడదాం. కుప్పం నా సొంత నియోజకవర్గం వంటిది. కనుక కుప్పంను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి నేను సిద్దం. కుప్పం మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులకు భరత్‌ అనేక ప్రతిపాదనలు పంపించారు. వాటన్నిటికీ నేను ఆమోదం తెలుపుతున్నాను. వాటి కోసం రూ.65 కోట్లు మంజూరు చేసి రెండు రోజులలో జీవో విడుదల చేస్తాను. ఇక్కడ భరత్‌ను గెలిపిస్తే అతనికి మంత్రి పదవి ఇస్తానని హామీ ఇస్తున్నాను,” అని అన్నారు.

సాధారణంగా అభ్యర్ధులు ఎమ్మెల్యేలుగా గెలిచి, వారి పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రి పదవుల కోసం పోటీ పడుతుంటారు. అయితే అభ్యర్ధి ఎమ్మెల్యేగా ఎన్నికవక మునుపే మంత్రి పదవి ప్రకటించడమే రివర్స్ టెండరింగ్ విధానం. ఈ ప్రకారమే మిగిలిన మంత్రి పదవులన్నీ కూడా ఇప్పుడే ఖరారు చేసేస్తే అప్పుడు మంత్రి పదవులు ఆశిస్తున్న మిగిలినవారు అందరూ కలిసి వైసీపీని ముంచేయడం ఖాయం!