YS Jagan Meet -Visakhapatnam Steel Plant Unioinsవిశాఖ ఉక్కు ఉద్యమం మొదలయ్యాకా ఏపీ సీఎం జగన్‌ మొట్టమొదటి సారి విశాఖపట్నంలో అడుగుపెట్టారు. అయితే శారదాపీఠం వెళ్లే బిజీలో ఉన్న జగన్ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీతో ఎయిర్ పోర్టులోనే చర్చలు జరిపారు. ఈ క్రమంలో ముందస్తు గా చాలా మంది కార్మిక నేతలను అరెస్టు చేసి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేవారితోనే సీఎం మాట్లాడినట్టు కొన్ని టీవీ ఛానళ్లు చెప్పుకొచ్చాయి.

అయితే అది అలా ఉండగా…. దక్షిణ కొరియాకు చెందిన పోస్కో కంపెనీని విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అడుగు పెట్టనివ్వని సీఎం జగన్ హామీ ఇచ్చారని… పోస్కో పరిశ్రమను భావనాపాడు, కడప, కృష్ణపట్నంలో ఏర్పాటు చేస్తామని తెలిపారని సీఎంని కలిసిన వారితో స్టేట్మెంట్లు ఇప్పించారు. అయితే ఈ విషయంలో సీఎం హామీ ఎంతవరకు ఉపయోగం అనేది అర్ధం కాకుండా ఉంది.

“స్టీల్ ప్లాంట్ పూర్తిగా కేంద్రం ఆధీనంలో ఉంది. ఒకవేళ వాటా అమ్మకం అంటూ జరిగితే వారిని రాకుండా ఎవరు ఆపగలరు? పోస్కో పరిశ్రమను భావనాపాడు, కడప, కృష్ణపట్నంలో ఏర్పాటు చేస్తామని చెప్పడం అంత తేలికా? ఒక కంపెనీ ఎక్కడ పెట్టాలో ముఖ్యమంత్రి నిర్ణయించేస్తారా? అటు కేంద్రంతోనూ, ఇటు ఆ కంపెనీతోను చర్చించకుండా ఈ విధమైన హామీలు సీఎం ఎలా ఇవ్వగలరు? కేంద్రానికి, దక్షిణ కొరియా కంపెనీకి జగన్ ఎంత అంటే అంతేనా ఏంటి?,” అని నిపుణులు అంటున్నారు.

“ఏదో ప్రస్తుతానికి పబ్బం గడిపేసేలా ఉన్నాయి ముఖ్యమంత్రి వ్యాఖ్యలు. ఇవన్నీ కార్మికులను మాయ చేసే మాటలే. కేంద్రానికి ఒక ఉత్తరం రాసేసి సరిపెట్టి ఏమీ చెయ్యకుండా ఉండిపోయారు. ఇప్పుడైనా శారదాపీఠం స్వామి కోసం విశాఖ వచ్చారు గానీ అంతమంది కార్మికులు ఉద్యమిస్తున్నా వారికి కనీస మద్దతు ఇచ్చే టైం లేదు,” అని కార్మిక సంఘాలు ఎద్దేవా చేస్తున్నాయి.