ys jagan media on Pawan-Kalyanటిడిపి – జనసేన బంధం తెగిపోనుందా… ఆ సమయం కోసమే వైసీపీ ఎదురు చూస్తోందా? అంటే ఖచ్చితంగా అవుననే అంటున్నాయి పొలిటికల్ వర్గాలు. గత ఎన్నికలలో పరోక్షంగా తెలుగుదేశం పార్టీ విజయంలో కీలకపాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ ను ఈ సారి తన వైపుకు మలుచుకుంటే, తన విజయానికి డోకా ఉండదు అనేది జగన్ ఆలోచనగా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో! రాజకీయ సలహాదారుడిగా వచ్చిన ప్రశాంత్ కిషోర్ కూడా ఇదే మాట చెప్పినట్లుగా ఇటీవల మీడియా వర్గాలలో హల్చల్ చేసిన విషయం తెలిసిందే.

మరి పవన్ కళ్యాణ్ ఆ దిశగా మొగ్గుచూపుతారా? రాజకీయ పరిస్థితులు ఎక్కడికి దారి తీస్తాయో ఇప్పుడే అంచనా వేయడం అసాధ్యం గానీ… మధ్య మధ్యలో అధికార పార్టీకి కొన్ని ‘జలక్’లు ఇచ్చేందుకు మాత్రం జగన్ పార్టీని ఓ రేంజ్ లో పవన్ వాడుతున్నారని మాత్రం పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి. ‘ఉద్దానం సమస్యను పరిష్కరించడానికి అవసరమైతే ప్రతిపక్ష పార్టీతో కలిసి పోరాడడానికైనా తాను సిద్ధం’ అన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో సరికొత్త చర్చకు దారి తీసాయి.

పవన్ చేసిన వ్యాఖ్యలలో వైసీపీకి దగ్గర కావాలి అన్న తాపత్రయం కంటే కూడా, ఉద్దానం సమస్యను అధికార పక్షం సీరియస్ గా తీసుకోవాలి అన్న తలంపే ఎక్కువగా కనపడుతోంది. ఒకవేళ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ సమస్యకు సానుకూల పరిష్కారాన్ని చూపని పక్షంలో… వైసీపీతో కలిసి టిడిపిపై పోరాటం చేయడానికి తాను వెనుకాడబోనన్న సంకేతాలను పవన్ పంపినట్లయ్యింది. సరిగ్గా చంద్రబాబుతో భేటీ కావడానికి ఒక రోజు ముందు ఈ వ్యాఖ్యలు చేయడంతో, వీటికి మరింత ప్రాధాన్యత దక్కినట్లయ్యింది.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ తో పవన్ కళ్యాణ్ నిజంగా పని చేస్తారో? లేదో? తెలియదు గానీ… జగన్ ను చూపించి, అధికార పక్షంతో ప్రజా సంక్షేమ పనులు చేయించడానికి పవన్ చూపుతున్న చొరవ ప్రశంసలను అందుకుంటోంది. ఉద్దానం సమస్య పరిష్కారం మొత్తం క్రెడిట్ అంతా ఒక్క పవన్ కళ్యాణ్ కే దక్కడంతో, జగన్ మీడియా తాజాగా కొత్త పల్లవి అందుకుంది. ఒక్క ఉద్దానం మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయంటూ జగన్ మీడియా చూపుతున్న అత్యుత్సాహం ముందుగా అంచనా వేసిందే!