YS Jagan Chandrababu Naiduరాష్ట్రంలో పార్టీని బలోపేతం చెయ్యడానికి గాను పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇంఛార్జిలను నియమించారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. అందులో భాగంగా పార్టీకి మొదటి నుండీ దన్నుగా నిలిచిన బీసీలకు పెద్దపీఠ వేశారు చంద్రబాబు. దానికి అధికార పార్టీ ఉలిక్కిపడింది అంటున్నారు టీడీపీ నాయకులు.

చంద్రబాబు ఆ ప్రకటన చేసి రెండు రోజులు కూడా కాకముందే… 56 బీసీ కార్పొరేషన్లకు చైర్మన్ లను ఉన్నఫళంగా ప్రకటించారు. 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఉన్నఫళంగా వాటికి చైర్మన్ లను నియమించారు. అందులో సగం మహిళలకు కేటాయించారు. బీసీలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

“పదహారు నెలలుగా పట్టని బీసీలు, బీసీ సంఘాలు ఉన్నఫళంగా గుర్తు వచ్చారు జగన్ కు. చంద్రబాబు బీసీలకు పెద్ద పీఠ వేసేసరికి వీరికి బీసీల మీద ప్రేమ పుట్టుకుని వచ్చింది. బీసీ సంఘాలు పూర్తిగా నిర్వీర్యం చేసేసి ఇప్పుడు కొత్తవి అంటున్నారు,” అంటూ టీడీపీ వారు ఎద్దేవా చేస్తున్నారు.

టీడీపీ ఆవిర్భావం నుండి బీసీలు ఆ పార్టీకు మద్దతుగా ఉన్నారు. అయితే ఈ ఓటు బ్యాంకును 2019 ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ కొంతమేర తమ వైపు తిప్పుకోగలిగింది. ఇప్పుడు వారిని తిరిగి తమ వైపు తెచ్చుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా కొత్త వారికి కూడా అవకాశం ఇచ్చారు ఈ సారి.