swaroopanandendra saraswati - jaganకృష్ణాతీరంలో సోమవారం శారదాపీఠ ఉత్తరాధికారి నియామక కార్యక్రమంలో మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రులు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, కె.చంద్రశేఖర్‌రావు తనకు అత్యంత ఆప్తులు, ప్రాణ సమానులేనని విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. “జగన్‌ నా ప్రాణం… ఆయన సీఎం కావాలని శారదా పీఠం ఐదేళ్లు తపస్సు చేసింది. కేసీఆర్‌ కూడా ప్రాణసమానుడే. ఆయన మహామేధావి,” అంటూ పొగడ్తలతో ముంచెత్తారు స్వామిజీ.

ఈ సందర్భంగా జగన్ కు ముద్దులు, కేసీఆర్ కు ఆలింగనాలతో ఉక్కిరిబిక్కిరి చేశారు స్వరూపానంద. ఆయన వ్యాఖ్యలతో చేష్టలతో అక్కడ ఉన్న వారంతా తాము దైవకార్యక్రమంలో ఉన్నామా లేక ఏదైనా రాజకీయ సభలో ఉన్నామా అనే అనుమానం కలిగిందట. ఇది ఇలా ఉండగా స్వాములోరి రాజభక్తికి తెలంగాణ ప్రభుత్వం నజరానా ప్రకటించింది. గండిపేట మండలంలోని కోకాపేట వద్ద విశాఖపట్నం శారదాపీఠంకు రెండెకరాల స్థలం కేటాయించింది.

24 కోట్ల విలువ చేసే ఈ భూమి పీఠానికి ఉచితంగా కేటాయించింది ప్రభుత్వం. దీని కోసం ఒక జీ.ఓ కూడా విడుదల చేసింది. అయితే ఈ కేటాయింపుకు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతుంది. ధర్మప్రచారం చేస్తున్న సంస్థకు ప్రోత్సాహకంగా ఈ కేటాయింపు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు సమర్ధించుకుంటున్నాయి. తెలంగాణాలో గానీ ఆంధ్రప్రదేశ్ లో గానీ ఇప్పుడు ప్రభుత్వాలను ప్రశ్నించే పరిస్థితులు లేవు. దీనితో అడిగే వారు ఎవరు?