YS Jagan Kuppam Tourఅమరావతిలో రాజధాని నిర్మిస్తే చంద్రబాబు నాయుడుకి పేరు వస్తుందని కుంటిసాకులతో నిర్మాణపనులు నిలిపివేసిన సిఎం జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభివృద్ధి పనులు చేపడుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. వచ్చే ఎన్నికలలో చంద్రబాబు నాయుడుని ఓడించాలనే లక్ష్యంతోనే హడావుడిగా భరత్‌ను అభ్యర్ధిగా ప్రకటించారు. ఆయన అభ్యర్దన మేరకు రూ.66 కోట్లు వెంటనే మంజూరు చేశారు. దాంతో కుప్పంలో యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపడుతున్నారు. వాటికి శంకుస్థాపన చేసేందుకు సిఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఈనెల 22న కుప్పంలో పర్యటించబోతున్నారు. బహిరంగసభ కూడా నిర్వహించబోతున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అధికారులతో కలిసి సభా ప్రాంతాన్ని సందర్శించి అవసరమైన ఏర్పాట్లు చకచకా చేస్తున్నారు.

మూడేళ్ళుగా సంక్షేమ పధకాల గోలే తప్ప అభివృద్ధి అనే పదం కూడా పలకని సిఎం జగన్మోహన్ రెడ్డి, తొలిసారిగా కుప్పంలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించి వెంటనే పనులు మొదలుపెట్టిస్తుండటం, వాటికి తనే స్వయంగా శంకుస్థాపన చేసేందుకు వస్తుండటం చూస్తే, కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే తపన కంటే చంద్రబాబు నాయుడు కంచుకోటగా ఉన్న కుప్పంలోనే ఆయనను ఓడించాలని ఎంతకసిగా ఉన్నారో కనబడుతోంది. చంద్రబాబు నాయుడుపై ద్వేషంతో అమరావతిని పక్కనపెట్టేసి రాష్ట్రానికి తీరని నష్టం కలిగించిన జగన్ ప్రభుత్వం, తన రాజకీయ అవసరం కోసం కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుండటం గమనిస్తే వైసీపీ రాజకీయాలు ఏవిదంగా ఉంటాయో అర్దం అవుతుంది.

అయితే జగన్ చంద్రబాబు నాయుడునే ఎందుకు టార్గెట్ చేసుకొన్నారంటే, యుద్ధంలో సేనాధిపతిని ఓడించగలిగితే సైన్యం అంతా లొంగిపోతుందనే ఆలోచనతో కావచ్చు లేదా ఆయనను ఓడించి పగ, ప్రతీకారం తీర్చుకోవాలని కావచ్చు. పగ, ప్రతీకారాలతో రగిలిపోయే ఏ వ్యక్తి బాగుపడిన దాఖలాలు లేవు ఒకవేళ కుప్పంలో చంద్రబాబు నాయుడుని ఓడిస్తే సిఎం జగన్మోహన్ రెడ్డి పగ, ప్రతీకారాలు చల్లారవచ్చేమో కానీ దాంతో టిడిపి పూర్తిగా నిర్వీర్యం అవుతుందనుకోవడం రాజకీయ అజ్ఞానమే.

జగన్ తన రాజకీయ కక్ష కోసమో, వైసీపీ రాజకీయ అవసరం కోసమో వైసీపీ ప్రభుత్వం కుప్పంకి భారీగా నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తోంది సంతోషమే. కానీ “నేటికీ వెనకబడిపోయిన మా శ్రీకాకుళం అభివృద్ధి చెందకూడదా?” అనే మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నకు సిఎం జగన్మోహన్ రెడ్డి చెవిన పడలేదా?స్వయంగా తన మంత్రి అడుగుతున్న ఈ ప్రశ్నకు ఏం సమాధానం చెపుతారు?

శ్రీకాకుళంలో అచ్చంన్నాయుడు, రామ్మోహన్ నాయుడు వంటి టిడిపి నేతలున్నారు కదా?కనుక శ్రీకాకుళంలో వారిని ఓడించేందుకు కూడా ఆ జిల్లాను అభివృద్ధి చేయవచ్చు. అలాగే రాష్ట్రంలో మిగిలిన జిల్లాలలో కూడా పలువురు టిడిపి నేతలున్నారు. కనుక వారిని ఓడించేందుకు రాష్ట్రమంతటినీ అభివృద్ధి చేయవచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తే అప్పుడు ప్రజలే వైసీపీని గెలిపిస్తారు కదా? కానీ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలలో గెలవాలనుకొంటున్నప్పుడు ఒక్క కుప్పం నియోజకవర్గాన్ని మాత్రమే అభివృద్ధి చేస్తే వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాగలదా?ఎలా సాధ్యం?