YS-Jagan-Kuppam-Tour-Highlightsచంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం కనుక ఆయన అక్కడకు తరచూ వెళుతుంటారు. కానీ గత కొన్ని నెలలుగా సిఎం జగన్మోహన్ రెడ్డి కూడా కుప్పం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుండటమే విడ్డూరంగా ఉంది. అది కుప్పం నియోజకవర్గ ప్రజలపై ప్రేమతో వెళితే అందరూ హర్షిస్తారు కానీ వచ్చే ఎన్నికలలో అక్కడ చంద్రబాబు నాయుడుని ఎలాగైనా ఓడించాలనే ఆలోచనతోనే సిఎం జగన్ కుప్పంకు వెళ్ళివస్తున్నారని ఈరోజు ఆయన మాటలలోనే అర్దమయ్యింది.

అక్క చెల్లెమ్మలకు సంక్షేమ పధకాల పేరుతో ఈ మూడేళ్ళలో ఎంత డబ్బు పంచి పెట్టారో చెప్పిన తర్వాత గత ప్రభుత్వానికి తన ప్రభుత్వానికి బేరీజు వేసుకొని చూడాలని విజ్ఞప్తి చేశారు. అంటే ఎన్నికల సమయంలో ఒకేసారి ఇంత సొమ్ము ఒక్కొక్కరికీ పంచిపెట్టడం సాధ్యం కాదు కనుక అధికారంలోకి వచ్చినప్పటి నుంచే వాయిదాల పద్దతిలో ఇస్తున్నానని చెప్పకనే చెపుతున్నారు.

అసలు ఏడాదికి ఒక 50వేలో లక్షో ఇస్తే ప్రజల జీవితాలు బాగుపడతాయనుకొంటే దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇదేవిదంగా డబ్బులు పంచిపెట్టి ఉంటే నేడు దేశంలో పేదరికం ఉండేదే కాదు కదా?మూడేళ్ళుగా జగన్ ప్రభుత్వం 1.17 లక్షల కోట్లు మహిళలకు పంచిపెట్టామని చెపుతున్నారు. అయినా ప్రతీ ఏడాది ఈ పధకాల పేరుతో వచ్చే డబ్బుకోసం ఇంకా ఆశగా ఎదురు చూస్తున్నారంటే అర్దం ఏమిటి? ఈ డబ్బుతో వారి జీవితాలలో ఎటువంటి మార్పు రాలేదనే కదా అర్దం?

ఇక చంద్రబాబు నాయుడుని ఓడించాలనుకోవడం తప్పు కాదు కానీ దాని కోసం ఇంత కసిగా ప్రయత్నిస్తుండటం చూస్తుంటే ఆయనను చూసి భయపడుతున్నట్లుంది తప్ప కుప్పంను ఉద్దరించడానికి వెళుతున్నట్లు లేదు. ఒకవేళ కుప్పం చుట్టూ మిగిలిన ఈ రెండేళ్ళలో మరో వందసార్లు ప్రదక్షిణాలు చేసి, మరో వందో రెండు వందల కోట్లో ఖర్చు చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన తర్వాత ఒకవేళ చంద్రబాబు నాయుడు ఏ శ్రీకాకుళం నుంచో లేదా విశాఖ నుంచో పోటీ చేస్తే?

చంద్రబాబు నాయుడు కుప్పంకి లోకలా నాన్ లోకలా అనేది మనం అనేసుకొంటే కాదు.. ప్రజలు అనుకోవాలి. ప్రధానమంత్రి కావాలను కలలుగంటున్న ఓ ముఖ్యమంత్రి తన మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ నేతల చేత ‘దేశ ప్రజలు తన నాయకత్వాన్ని కోరుకొంటున్నారని’ పదేపదే చెప్పిస్తుంటారు. అంతమాత్రన్న దేశప్రజలందరూ నిజంగా ఆయన ప్రధాని కావాలని కోరుకొంటున్నట్లు కాదు కదా?ఇదీ అంతే. కుప్పంకు ఎవరు కావాలో ప్రజలే నిర్ణయించుకొంటారు.

మన అభిప్రాయాలను ప్రజల అభిప్రాయాలుగా వారిపై రుద్దినంత మాత్రన్న ఏదీ మారిపోదు. జరగవలసినవి తప్పకుండా జరుగుతాయి. అయినా ఈవిదంగా మనసులో ఒకరి పట్ల కసి, పగ, ద్వేషం నింపుకొని చేసే ఏ ప్రయత్నాలు ఫలించవు. చిత్తశుద్ధితో చేసినప్పుడే సత్ఫలితాలు వస్తాయని గ్రహిస్తే మిగిలిన ఈ రెండేళ్ళలో అయినా ప్రజల ఆకాంక్షలను అర్దం చేసుకొని పనిచేస్తే ఏమైనా ఫలితం ఉంటుంది.