YS Jagan Kia Motors Car Launch jobs to Locals 75 percent ఈ నెల 8న (రేపు) ‘కియా’ కారు ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రానున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ప్రతిపక్షంలో ఉండగా ఈ కంపెనీని వైఎస్సార్ కాంగ్రెస్ గట్టిగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఈ ప్లాంటు రాకుండా చెయ్యడానికి భూనిర్వాసితులను వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు రెచ్చగొట్టారని ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడదంతా గతం… వైఎస్ 2007లో లేఖ రాయడం వల్లే కియా ఆంధ్రప్రదేశ్ కు వచ్చిందని చెప్పుకునే స్థాయికి వచ్చింది వైఎస్సార్ కాంగ్రెస్.

ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే కియా కారు ప్రారంభోత్సవంలో జగన్ ఏం మాట్లాడతారు అనేదాని మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొందరు సోషల్ మీడియాలో ఇటీవలే ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం గురించి ప్రస్తావిస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలనే కొత్త చట్టం ప్రభుత్వం చేసిన విషయం తెలిసిందే. పాత పరిశ్రమలకు కూడా ఈ నిబంధన వర్తింప చేశారు. అయితే దీని మీద జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది.

ఇది రాజ్యాంగ ఉల్లంఘన అని కొందరు అంటే… దీనివల్ల ఏపీకి పరిశ్రమలు రావని ఇంకొందరు అంటున్నారు. ఈ క్రమంలో జగన్ అక్కడ ఈ నిబంధనను నేరుగా ప్రస్తావించగలరా అని ప్రశ్నిస్తున్నారు. 8న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘కియా’ పరిశ్రమలో ఉండే అవకాశం ఉందని సమాచారం. మొత్తం ప్లాంటు కలియతిరిగి పూర్తి వివరాలు ఆయన తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. పరిమిత స్థాయిలో వ్యక్తులను అనుమతించే ఈ కార్యక్రమం సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.