రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కే చంద్రశేఖరరావులు సంప్రదింపుల ద్వారా రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నారు. జగన్ అధికారంలోకి వచ్చి నెల అయ్యిందో లేదో ఇప్పటికే ఆరు సార్లు కలిశారు ఇద్దరూ. ఇప్పుడు మొట్టమొదటి అధికారిక సమావేశంలో పాల్గొంటున్నారు. విభజన సమస్యలు, నీటి పంపకాలపై చర్చించారు. రెండో రోజు కూడా వారి భేటీ కొనసాగుతుంది.

అయితే గతంలో గవర్నర్ సమక్షంలో ఇద్దరు భేటీ అయినప్పుడు జగన్ హైదరాబాద్ లో ఆంధ్రకు కేటాయించిన బిల్డింగులను ఎటువంటి షరతులు లేకుండా అప్పగించారు. ఆ సమయంలో భవనాల విలువ తెలంగాణ నుండి కోరతామని ప్రభుత్వం లీకులు ఇచ్చినా అటువంటిది ఏమీ జరగలేదు. దానితో జగన్ కేసీఆర్ కు లొంగిపోయారు అంటూ టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు తాజాగా వారికి ఇంకో అనుమానం కలిగింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఒక డ్రై పోర్టు కోరుతున్న విషయం తెలిసిందే.

అయితే అదే గనుక జరిగితే ఆంధ్రప్రదేశ్ నుండి పెట్టుబడులు తరలిపోతాయనే భావన ప్రభలంగా ఉంది, ఇటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ పోర్టుల అభివృద్ధికి సంబంధించిన జీవో ఒకటి విడుదల చేసింది. అయితే జీవో రహస్య జీవో కావడం విశేషం. దీనితో కేసీఆర్ కోరుతున్న డ్రై పోర్టును తెలంగాణకు రహస్యంగా కట్టబెట్టారా అనే అనుమానం వారు వ్యక్తం చేస్తున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో ఇచ్చిన రహస్య జీవోలను తీవ్రంగా విమర్శించిన జగన్ ఇప్పుడు అదే పని చేస్తుండడం విశేషం.