YS Jagan - KCR Closed door meeting-ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి భేటీ అయ్యారు. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుండీ ఇది నాలుగవ భేటీ. ఈ సారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమరావతి వస్తారని అప్పట్లో ప్రచారం జరిగినా ఈ మీటింగ్ కూడా ప్రగతి భవన్ లోనే జరిగింది. పండుగకు ఒక రోజు ముందుగా మీటింగా అంటూ ఈ భేటీ మీద అంతా ఆసక్తి కనబరిచారు.

అయితే ఈ భేటీ గురించి మీడియాలో ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో జరిగిన భేటీలలా కాకుండా ఈ సారి అధికారులను అనుమతించలేదంటా. ఇరు ముఖ్యమంత్రులతో పాటు కొంత సమయం పాటు రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మాత్రమే ఉన్నట్టు సమాచారం.

దీనితో రాష్ట్రాల మధ్య సమస్యల గురించి కాకుండా రాజకీయ చర్చ జరిగిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో రాజధాని మార్పు, దేశంలో ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ వివాదం, రెండు తెలుగు రాష్ట్రాలలో బీజేపీ దూకుడు వంటి అంశాలు వారు చర్చిస్తున్నారని కొన్ని వార్త ఛానెల్స్ చెబుతున్నాయి.

మొన్న ఆ మధ్య కృష్ణా గోదావరి మీద ఉమ్మడి ప్రాజెక్టు గురించి ఇరు సీఎంల మధ్య పొరపొచ్చాలు వచ్చాయని కొన్ని వార్తలు వచ్చాయి. అయితే అటువంటిది ఏమీ లేదని అర్ధం చేసుకోవచ్చు. అయితే ఏపీ ప్రభుత్వ వర్గాలు మాత్రం ఇది పూర్తిగా విభజన సమస్యలు, ఇరు రాష్ట్రాల సంబంధాలకు సంబంధించిన భేటీ మాత్రమే అని చెప్పడం విశేషం.