YS- Jagan - KCRవిభజన సమస్యల పరిష్కారంపై రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు నిన్న మూడు గంటల పాటు స్థూలంగా చర్చించారు. ఏపీభవన్‌ తెలంగాణ వారసత్వ సంపద అయినందున దానిని పూర్తిగా తమకే కేటాయించాలని, ఏపీభవన్‌ను మరో చోట నిర్మించాలని తెలంగాణ అధికారులు గతంలో వాదించారు. అవసరమైతే అందుకు ఆంధ్రప్రదేశ్ కు కొంత సొమ్ము ముట్టచెబుతామని తెలంగాణ ప్రభుత్వం చెబుతుంది. ఏపీ అధికారులు జనాభా ప్రాతిపదికన 58:42 నిష్పత్తిలో విభజన జరగాలని పట్టుబట్టారు.

పటౌడీ హౌస్‌ తెలంగాణకు ఇచ్చి, మరికొంత స్థలం నర్సింగ్‌ హాస్టల్లో ఇస్తామని, శబరీ బ్లాక్‌, మసీదు వెనుకవైపున్న స్టాఫ్‌ క్వార్టర్స్‌, గోదావరి బ్లాక్‌లో కొంత ఇస్తామని చెప్పారు. ఒక దశలో ప్రస్తుత భవనాలు పూర్తిగా కూల్చివేసి ఎవరికి వాళ్లు కట్టుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అధికారుల స్థాయిలో ఇది పరిష్కారం అయ్యే అవకాశం లేకపోవడంతో ముఖ్యమంత్రుల స్థాయిలో దీనిపై చర్చించాలని నిర్ణయించినట్టు సమాచారం. మొత్తం 19.73ఎకరాలలో ఏపీ భవన్ ఉంది. జనాభా నిష్పత్తి లో పంచుకుంటే ఆంధ్రప్రదేశ్ కు 11.32 ఎకరాలు, తెలంగాణ కు 8.41 ఎకరాలు రావాల్సి ఉంటుంది.

అయితే ఈ విషయంలో ఔదార్యం చూపించాలని కేసీఆర్ జగన్ ను కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఆంధ్ర భవన్ ను పూర్తిగా తెలంగాణ వదిలేసి కొంత డబ్బు తీసుకోవాలని, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మైత్రికి నజరానాగా ఇవ్వాలని కొందరు ఏపీ అధికారులు కూడా జగన్ కు సలహా ఇచ్చినట్టు తెలుస్తుంది. వచ్చే నెల రెండవ వారంలో అమరావతిలో జరిగే ముఖ్యమంత్రుల మీటింగ్ లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే హైదరాబాద్ లో ఏపీ అధీనంలో ఉన్న భవనాలు తెలంగాణకు ఎటువంటి షరతులు లేకుండా జగన్ ఇచ్చేసిన సంగతి తెలిసిందే.