YS Jagan - Kanumuru Raghu Rama Krishnam Rajuగత ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ కు బీజేపీ తెరచాటు నుండి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత జగన్ కూడా ఢిల్లీ ని ధిక్కరించే ప్రయత్నం చెయ్యకుండా వారికి అనుకూలంగానే వ్యవహరించే వారు. ఒక్కో సారి బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో బలపడటానికి జగన్ ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందని కూడా వార్తలు వచ్చాయి.

అయితే ఇప్పుడు బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్ మధ్య బంధం ఏమిటో తెలిసిపోయే సమయం ఆసన్నమయ్యింది. పార్టీని పదే పదే ధిక్కరికిస్తున్న ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటుకు వైసీపీ పావులు కదుపుతోంది. మూడేళ్ల క్రితం బిహార్‌లో సీఎం నితీష్ కుమార్ కాంగ్రెస్, ఆర్జేడీతో తెగతెంపులు చేసుకున్నారు. మళ్లీ బీజేపీతో పొత్తుపెట్టుకున్నారు.

అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన శరద్ యాదవ్ విపక్షాల సభకు హాజరయ్యారు. పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా వ్యవహరించినందున శరద్ యాదవ్‌ను ఫిరాయింపుల నిరోధక చట్టం సెక్షన్-2 కింద అనర్హుడిగా ప్రకటించాలంటూ వెంకయ్యను నితీష్ కోరారు. తక్షణమే స్పందించిన వెంకయ్య శరద్ యాదవ్‌పై వేటు వేశారు.

ఇప్పుడు ఇదే సెక్షన్-2 కింద రఘురామకృష్ణంరాజుపై వేటు వేయించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇటువంటి విషయాలలో పూర్తిగా లోక్ సభ స్పీకర్ విచక్షణాధికారాల మీద ఆధారపడి ఉంటుంది. అంటే అది పూర్తిగా బీజేపీ అధిష్టానం నిర్ణయమే. వేటు వేస్తే బీజేపీ… వైఎస్సార్ కాంగ్రెస్ ఒక అవగాహన మీద ముందుకు వెళ్తున్నట్టే. కాబట్టి ఈ వ్యవహారంతో బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్ మధ్య బంధం ఏమిటో తెలిసిపోతుంది.