YS Jagan - Kanumuru Raghu Rama Krishna Raju - Narendra Modiకాంగ్రెస్ టిక్కెట్ మీద ఎన్నికై ఆ తరువాత రెబెల్ గా మారిన ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీలో జరుగుతున్న పరిణామాలను ప్రధాని దృష్టికి రఘురామ తెచ్చినట్లు తెలుస్తోంది. రాజధాని మార్పు మొదలుకుని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, దేవాలయాలపై దాడులు ఇలా అనేక విషయాలను ప్రధానికి ఆయన వివరించినట్లు చెబుతున్నారు.

వీటన్నింటిపై విన్న ప్రధాని ఒక్క విషయంలో మాత్రం విస్మయానికి గురయ్యారని రఘురామకృష్ణంరాజు చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో చర్చిల నిర్మాణాలకు ప్రభుత్వం టెండర్ల పిలిచిందని రఘురామకృష్ణంరాజు ప్రధాని దృష్టికి తెచ్చారట. దీంతో చర్చిల నిర్మాణానికి టెండర్లా?

ప్రభుత్వమే టెండర్లు పిలవడం ఎలా సాధ్యమని మోదీ సైతం ఆశ్చర్యపోయారని రఘురామకృష్ణంరాజు చెప్పారు. ఆ చర్చిల టెండర్లకు సంబంధించిన వివరాలు తన ఆఫీసులు పంపాలని ప్రధాని కోరారు అని రఘురామకృష్ణరాజు మీడియాకు చెప్పుకొచ్చారు.

గత ఏడాది డిసెంబర్ లో గుంటూరు జిల్లా, రొంపిచర్ల మండల కేంద్రంలో నూతన చర్చ నిర్మించేందుకు పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం టెండర్లు పిలిచింది. ‘బేతల్ క్రిస్టియన్ బ్రథర్న్ ట్రస్ట్ చర్చ్’ పేరుతో నిర్మిస్తున్న చర్చ్ కోసం 8లక్షల 72వేల 663 రూపాయలు కేటాయించింది. గతంలో కూడా ప్రభుత్వం రాష్ట్రంలో మూడు చర్చిల నిర్మాణానికి నిధులు విడుదల చేసింది. అయితే మైనార్టీ సంక్షేమంలో భాగంగానే చర్చిలు నిర్మిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.