YS-Jagan-Kadapa-Steel-Plantసుమారు మూడేళ్ళ క్రితం అంటే 2019, డిసెంబర్ 23న సిఎం జగన్ తన సొంత జిల్లా కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానంటూ శిలాఫలకం వేశారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ, “ఎన్నికలకు ముందు టెంకాయ కొడితే అది మోసం… అదే… అదికారంలోకి రాగానే కొడితే అది చిత్తశుద్ది అంటారు. నేను ఇప్పుడు టెంకాయ కొట్టి ఈ శిలాఫలకం వేసి నా చిత్తశుద్ధిని నిరూపించుకొన్నాను. సరిగ్గా మూడేళ్ళలో ఇక్కడ వేలాదిమందికి ఉద్యోగాలు కల్పించే స్టీల్ ప్లాంట్ పనిచేస్తుంటుంది… దానిని మీ కళ్ళతో మీరే చూస్తారు. అప్పుడే నమ్మండి,” అని చెప్పారు. చప్పట్లు పడ్డాయి.

ఇవాళ్ళ 2022, ఆగస్ట్ 19వ తేదీ. మరో నాలుగు నెలల్లో జగన్ పెట్టిన మూడేళ్ళ గడువు పూర్తయిపోతుంది. కనుక ఈపాటికి కడప స్టీల్ ప్లాంటు నిర్మాణం పూర్తి చేసుకొని ఉత్పత్తికి సిద్దంగా ఉండే ఉంటుంది…. అని అనుకొంటున్నారా? సహజం. కానీ ఇంతవరకు స్టీల్ ప్లాంట్ కాంపౌండ్‌ వాల్ కూడా పూర్తిగా నిర్మించలేదు.

మరి ఆరు నెలలు టెంకాయా… చిత్తశుద్ధి అంటారా… ఎందుకు లేదు టెంకాయ శుద్ధి ఉంది కనుకనే ఇటీవల అచ్యుతాపురంలో కూడా చాలా టెంకాయలు కొట్టారు. చంద్రబాబు నాయుడు హయాంలో పారిశ్రామిక వేత్తలు ఏపీ వైపు చూసేవారేకారని ఇప్పుడు తన మొహం చూసి వందల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఏపీకి క్యూ కడుతున్నారని సిఎం జగన్మోహన్ రెడ్డి గర్వంగా చెప్పుకొన్నారు. ఏపీ ప్రజలకు అంతకంటే సంతోషం ఏముంటుంది?

అయితే మూడేళ్ళు కావస్తున్నా సొంత జిల్లా కడపలోనే స్టీల్ ప్లాంట్ కట్టలేనప్పుడు, విశాఖలో ఎప్పుడు కడతారు?అని సోషల్ మీడియాలో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.