ys jagan job calendar 2022 తెలంగాణ అసెంబ్లీలో ఇటీవల కేసీఆర్ ప్రకటించిన జాబ్ నోటిఫికేషన్ ప్రకంపనలు ఇప్పుడు జగన్ ను తాకాయి. వైస్సార్సీపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో నిరుద్యోగ యువతను ప్రభావితం చేసిన హామీల పద్దు ఎక్కువే. ప్రతి సవంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని., మేము అధికారంలోకి వచ్చిన కొద్దీ నెలల్లోనే ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఇచ్చిన హామీలతో ఏపీ నిరుద్యోగ యువతను బాగానే మభ్యపెట్టగలిగారన్న యదార్ధం అర్ధమవ్వడానికి ఏపీ యువతకు ఇంత సమయం పట్టిందని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి.

తమ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి అవసరం లేదని.., కేవలం ఉద్యోగాల వృద్దే ఉంటుందని పంచ్ డైలాగ్స్ వేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు రోడ్ల మీదకు తమ నిరసనను తెలియచేయడానికి వస్తే మాత్రం అరెస్టులతో సమాధానం చెపుతున్నారని మండిపడ్డారు నిరుద్యోగ సంఘ నేతలు. ప్రభుత్వంపై వ్యతిరేకతను తెలియచేయడానికి విజయవాడలో నిరుద్యోగ యువత తమ నిరసనలతో కదం తొక్కారు. పెండింగ్ లో ఉన్న 2.35 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

యువతకు ఉద్యోగాలంటే వాలంటరీ జాబులో., రేషన్ చేరవేసే డ్రైవర్ జాబులో., లేక చికెన్, మటన్, ఫిష్ మార్టుల్లో జాబులు కాదని విజయవాడలో ఉన్న ధర్నా చౌక్ వద్ద విద్యార్థి సంఘాల యువత పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. 25 వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ వెంటనే జారీ చేయాలసిందేనని ప్రభుత్వానికి తమ ఆక్రోశాన్ని వ్యక్తపరిచారు. ఉద్యోగాలు ఇవ్వలేని పక్షంలో తమకు నెలకు 5 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలని లేకపోతే వచ్చే ఎన్నికలలో తాము మీ ఉద్యోగాలను ఖాళీ చేసే పనిలో బిజీగా ఉంటామని ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలే చేశారు. ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ నిరుద్యోగ యువతకు తమ మద్దతును తెలిపాయి.

నిరుద్యోగులతో ఇంతటి ఆవేశాన్ని రగిల్చిన ఘనత మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికల వ్యూహంలో భాగంగానే ఈ “జాబ్ మేళ” ప్రకటనను భావిస్తున్నామని అక్కడి ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించినా, ఆ ప్రాంత నిరుద్యోగులకు ఇది ఒక మంచి బహుమతిగానే ప్రభుత్వ పెద్దలు సమర్ధించుకుంటున్నాయి. ఏది ఏమైనప్పటికి తెలంగాణ యువత మాత్రం ప్రభుత్వం ఇచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారనేది నిజం. అటు తిరిగి, ఇటు తిరిగి కేసీఆర్ ప్రకటన జగన్ మెడకు గుదిబండగా మారినట్టుంది.