ఇది జగన్ అసలు తంతు! ‘వన్ టైం సెటిల్మెంట్’ పేరుతో పేదల నుండి పది వేలు కట్టించే కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే ఒక్క రూపాయి కూడా ఎవరూ కట్టవద్దంటూ ప్రతిపక్ష అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన ఒక నెల రోజుల లోపునే ఇళ్లన్నీ పేదలకు ఉచితంగా రిజిష్ట్రేషన్స్ చేసి ఇస్తామని పెద్ద ఎత్తున హామీలు గుప్పిస్తున్నారు.

అధికార – ప్రతిపక్ష నేతల తీరు ఇలా ఉంటే, అధికారులు, వైసీపీ నేతలు మాత్రం ‘తాము బలవంతంగా ప్రజల నుండి కట్టించుకోవడం లేదు, ఈ స్కీం నచ్చితేనే చెల్లించండి’ అని చెప్తున్నామని మీడియా ముందుకొచ్చి వ్యాఖ్యానిస్తున్నారు. అయితే గ్రౌండ్ లెవల్లో ఏం జరుగుతుందో అని చెప్పడానికి నిదర్శనంగా సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.

తూర్పు గోదావరి జిల్లాలోని కొత్తకోటలో సైకిల్ షాప్ నడుపుకుంటున్న ఓ నిరుపేద వీడియో చూసిన నెటిజన్లు ఈ ‘ఓటీఎస్’ స్కీంపై మరింత మండిపడుతున్నారు. పొట్ట కూటి కోసం తాను సైకిల్ షాప్ నడుపుకుంటున్నానని, తన దగ్గర బండి కూడా లేదని, రోజూ మందపల్లి సైకిల్ మీదే వెళ్లి వస్తానని, పనులు కూడా సరిగ్గా ఉండడం లేదని, ఏదో మా బతుకులు బతుకుతున్నామని తమ దయనీయ పరిస్థితిని వివరించారు.

మా అమ్మ గారికి ఆరోగ్యం కూడా సరిగా ఉండదని, పంచాయితీకి పిలిచి చేతిలో కాగితం పెట్టి ఇప్పటికిప్పుడు పది వేలు కట్టమంటే ఎలా కట్టాలని ప్రశ్నించారు. ఇంటికి నలుగురు వచ్చి ఖచ్చితంగా కట్టాలని బెదిరించారని, లేదంటే ఇంటికి తాళం వేసేస్తామని అన్నారని ఆయన అర్ధాంగి తమ ఆవేదనను వ్యక్తం చేసింది. దుర్భరమైన వారి జీవితం ఏ పాటిదో ఈ వీడియో చూస్తే ఇట్టే అవగతం అవుతుంది.

ఇది కేవలం ఒక మచ్చుతునక మాత్రమే. ఇలాంటి కన్నీటిఘోషకు, నిరుపేదల ఆవేదనలు ఆక్రందనలకు ఏపీ నిలయంగా మారుతోంది. తమ బతుకులను నేరుగా సీఎం వచ్చి చూడలేరు కాబట్టి, ఇలా సోషల్ మీడియాలో సిగ్గువిడిచి చెప్పుకుంటున్నారు. బహుశా ఇలాంటి వీడియోలు చూసిన తర్వాత అయినా తన నిర్ణయాన్ని ‘మూడు రాజధానుల బిల్లు’ మాదిరి సీఎం వెనక్కి తీసుకుంటారేమో చూడాలి.