YS Jagan - Hindu Templesగడచిన పక్షం రోజులలో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడో ఒక చోట హిందువుల మనోభావాలు దెబ్బతీసే ఘటనలు జరుగుతున్నాయి. అంతర్వేది రథం తగలబెట్టిన ఘటన తరువాత వివిధ ప్రాంతాలలో దేవతామూర్తులకు అపచారం జరుగుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఏపీలో రెండవ ప్రసిద్ధ దేవాలయమైన విజయవాడ కనకదుర్గ గుడిలోనే వెండి ఏనుగులు చోరీకి గురయ్యాయి.

ఈ తరుణంలో నెల్లూరు జిల్లాలోని ఆలయాల్లో భద్రత కట్టుదిట్టం చేసారు…. విస్తృతంగా సీసీ కెమెరాల ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. పోలీసులు, సెక్యూరిటీ సిబ్బందితో పహారాకు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ వరకు బానే ఉంది మరో అడుగుముందుకు వేసి స్వామివార్ల ఆభరణాలకు, రథాలకు ఇన్సూరెన్స్‌ చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అయితే దానికి కొందరు ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు. “ప్రభుత్వం హిందూ దేవాలయాలనుండి రకరకాలుగా సొమ్ములు తన కార్యక్రమాలకు మళ్ళిస్తుంది. అయినా దేవాలయాల ఆస్తుల మీద శ్రద్ద లేదు. వాటిని పరిరక్షించలేక ఇన్సూరెన్సు చేయిస్తుందా?,” అని వారు ప్రశ్నిస్తున్నారు.

దేవుడు తన ఆస్తులు తాను కాపాడుకోలేక ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నాడు అనే అపప్రధ వస్తుంది. పటిష్టమైన భద్రత సీసీ టీవీ కెమెరాలు ఉన్నప్పుడు ఇన్సూరెన్సు ఎందుకు? అని వారు ప్రశ్నిస్తున్నారు? అయితే అన్నీ ఉన్నాయని మన ప్రభుత్వాల నిర్వాకం చూస్తూనే ఉన్నాం… కాబట్టి ఇన్సూరెన్సు ఉంటేనే మంచిదేమో అని విమర్శిస్తున్న వారు కూడా ఆలోచించాలి.