YS Jagan Helicopter Technical Problemsఅనుకోకుండా తప్పుజరిగితే దాన్ని పొరపాటు అంటారు. జరిగిన పొరపాటే మరోసారి జరిగితే దాన్ని నిర్లక్ష్యం అంటారు.. కానీ జరిగిన తప్పే మళ్ళీ మళ్ళీ జరుగుతుంటే, అది కూడా సాక్ష్యాత్తూ ఓ ముఖ్యమంత్రి భద్రత విషయంలో ఆ తప్పులు రిపీట్లు మీద రిపీట్లు అవుతుంటే దానిని నేరంగా పరిగణించాలా.. ఎలా పరిగణించాలి అంటూ భారీ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానాలు, హెలికాఫ్టర్ లలో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. గడిచిన మూడు నెలల వ్యవధిలో మూడు సార్లు సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో వైసీపీ శ్రేణులు, జగన్ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జగన్ విమానం లేదా హెలికాఫ్టర్ ప్రయాణం చేయబోతున్నారు అంటేనే పార్టీ శ్రేణులు హడలిపోతున్నారు.

Also Read – ఏపీ టికెట్స్ అమ్ముకున్నారటగా? ఎవరో అభాగ్యులు?

పదేపదే జగన్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ లో సాంకేతికలోపం తలెత్తడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. పైగా ఇది సాధారణ అంశం కాదు అనే చర్చ కూడా బలంగా జరుగుతుంది. అంతేకాకుండా హెలికాప్టర్ లో సాంకేతిక లోపం అనే మాట వినబడగానే చటుక్కున గతంలో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదాలే ప్రజల కళ్ళ ముందు మెదులుతున్న పరిస్థితి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్, మాజీ లోక్ సభ స్పీకర్ జి.యం.సి బాలయోగి, డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ లు హెలికాఫ్టర్ ప్రమాదాల వల్లే ప్రాణాలు కోల్పోయారు.

గత జనవరి 30 న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సన్నాహక సమావేశంలో పాల్గొనేందుకు, విదేశీ రాయబారులతో భేటి అయ్యేందుకు జగన్ తో పాటు ఆయన బృందం విమానంలో ఢిల్లీ పయనమయ్యారు. అయితే విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే సాంకేతికలోపం తలెత్తింది. ఏసీ గ్యాస్ పైప్ లీకేజ్ అయినట్లుగా గుర్తించి హుటాహుటిన గన్నవరం విమానాశ్రయం లో అత్యవసర ల్యాండింగ్ చేయించారు.

Also Read – టిడిపి మౌనం కూడా వైసీపికి ఆందోళన కలిగిస్తోందా?

అదేవిధంగా గత మార్చ్ లో విశాఖలో నిర్వహించిన జి20 సన్నాహక సదస్సు కు వెళ్ళే సమయంలో కూడా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. తాజాగా అనంతపురం జిల్లా నారపల్లి నుండి పుట్టపర్తికి వెళ్ళే సమయంలో కూడా హెలికాఫ్టర్ లో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో చేసేదిలేక సుమారు 75 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గం గుండా ప్రయాణించి సింగనమలకు చేరుకున్నారు జగన్.

ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రయాణిస్తున్న సమయంలో విమానం, హెలికాఫ్టర్లు పూర్తి కండీషన్ లో ఉంటేనే ప్రయాణానికి అనుమతిస్తారు. చిన్న లోపం ఉందని తెలిసినా ప్రయాణానికి అనుమతించరు. ముఖ్యమంత్రి ప్రయాణించే విమానాలు, హెలికాఫ్టర్ ల విషయంలో ప్రభుత్వం ప్రవేటు విమానయాన సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నప్పటికి, అసలు కండీషన్ లో లేని విమానాలను ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Also Read – జైలు జీవిత పుష్కరాలు… మళ్ళీ గుర్తుకొస్తున్నాయా..?

సీఎం సురక్షితంగా ప్రయాణించే అంశంపై ప్రోటోకాల్ విభాగం ప్రత్యేక దృష్టి పెట్టింది. ముందుముందు ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటుంది. హెలికాప్టర్ లో సాంకేతికలోపం అనే మాట వినగానే జగన్ అభిమానులు మాత్రం తీవ్ర ఆందోళనలకు గురవుతున్న పరిస్థితి.