Ys Jagan have you remember Ambedkar Memorial ‘మాటలు కోటలు దాటుతాయి, చేతలు చెప్పులు దాటవు’ అని పెద్దలు ఊరకనే అనలేదు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాటలు నిలుస్తున్నాయి. రాజ్యాంగ రచయిత అంబేద్కర్ జన్మదినం సందర్భంగా… 2020 నాటి ఏపీ సీఎం వ్యాఖ్యలు ఓ సారి మననం చేసుకోవాలి.

అధికారం చేపట్టిన మరుసటి ఏడాది 2020లో విజయవాడ స్వరాజ్య మైదాన్ లో అంబేద్కర్ అత్యంత భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని, దానికి సంబంధించిన ముఖచిత్రాన్ని కూడా విడుదల చేసారు. అదేలేండి… జగన్ పార్టీ యొక్క పరిభాషలో చెప్పాలంటే… గ్రాఫిక్స్ బొమ్మ.

2021 నాటికి అంబేద్కర్ పేరుతో స్మృతివనం ఏర్పాటు చేసి, బాబాసాహెబ్ కు ఘనమైన నివాళి అర్పిస్తామని నాడు ఘనంగా ప్రకటించారు. 2021 గడిచి మరో ఏడాది కూడా పూర్తయ్యింది, దీనికి సంబంధించి విజయవాడ స్వరాజ్య మైదాన్ లో ఒక్క ఇటుక రాయి కూడా పడలేదు.

నిజానికి అంబేద్కర్ స్మృతివనాన్ని ఎంతో ఘనంగా రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేస్తామని నాటి టీడీపీ ప్రభుత్వం చెప్పింది. దీనిని పక్కనపెట్టి విజయవాడ నడిబొడ్డులోనే నిర్మిస్తానని వైసీపీ సర్కార్ ప్రకటించింది. హామీలకైతే ఇచ్చేసారు గానీ, కార్యరూపం మాత్రం దాల్చలేదు.

మరొక విషయం ఏమిటంటే, ఇదే స్వరాజ్య మైదాన్ విషయంలో టీడీపీ సర్కార్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. నాడు సింగపూర్ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుని, విజయవాడకు తలమానికంగా భారీ కాంప్లెక్స్ ను నిర్మించ ప్రణాళికలు గావించింది. కానీ ఈ మైదానం ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఇందులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని నాటి ప్రతిపక్షాలు ఆందోళన చేసాయి.

అధికారం వచ్చిన తర్వాత అదే స్వరాజ్య మైదాన్ లో అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుంది. దీంతో తమకు లాగానే టీడీపీ కూడా స్వరాజ్య మైదాన్ లో ఈ కట్టడాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తే, నింద అంతా టీడీపీ పైన వేయవచ్చని భావించారో ఏమో గానీ, అంబేద్కర్ స్మృతివనం కేవలం పేపర్ పైనే మిగిలిపోయింది.

ఇంకా మరో రెండేళ్ల పాటు అధికారం చేతిలో ఉంది గనుక, నిజంగా చిత్తశుద్ధి ఉంటే ‘అంబేద్కర్ స్మృతివనం’ ఏర్పాటు చేయడం ఏపీ సర్కార్ కు పెద్ద విషయమేమీ కాదు. అయితే దీనిని కూడా తమ ఓట్ బ్యాంకుగా మలుచుకునేందుకు, సరిగ్గా ఎన్నికల ముందు ప్రారంభిస్తే, టీడీపీ ప్రధాన ఓట్ బ్యాంకు అయిన బీసీలను తమ వైపుకు తిప్పుకునే ప్రణాళిక ఉండొచ్చు అనేది రాజకీయ విశ్లేషకుల మాట.