ys jagan have you forgotten flashbackఆంధ్రప్రదేశ్ ప్రజానీకంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్నట్లుగా ఉన్నారు. విభజన అంశాలు చర్చించాలని కేంద్ర ప్రభుత్వం చూపిన చొరవతో ఏకంగా ‘ప్రత్యేక హోదా’ను తాము ఏపీకి తీసుకువచ్చేసామన్న ప్రచారాన్ని జగన్ మీడియా నెత్తికెత్తుకుంది. దీంతో ఈ సారి స్పష్టంగా ఆ ‘స్పెషల్ స్టేటస్’ను తప్పించి మళ్ళీ కేంద్రం ప్రకటన ఇచ్చే పరిస్థితిని వైసీపీ కల్పించింది.

అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే… ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పధంలో తీసుకువెళ్లేందుకు గానీ, ఏపీలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు గానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు నిందలు వేసుకుని చివరికి ప్రజలను బలహీనులను చేస్తున్నాయి. జగన్ మీడియా చేసిన హంగామాతో బిజెపి నేత జీవీఎల్ ఏకంగా ఓ వీడియోను రికార్డ్ చేసి వైసీపీ ప్రచారాన్ని తిప్పికొట్టారు.

అయినా స్పెషల్ స్టేటస్ అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మరిచిపోయి రెండేళ్లు పైనే అయ్యింది. ఎప్పుడైతే అధికారం చేపట్టారో, కొద్దీ రోజుల్లోనే కేంద్రంలో పూర్తి మెజారిటీ వచ్చింది గనుక, మనం చేయగలిగేది ఏమి లేదని చేతులెత్తేసిన ఫ్లాష్ బ్యాక్ ను ‘జగన్ అండ్ కో’ పూర్తిగా మరిచినట్లున్నారు. అలాంటి గొప్ప ఫ్లాష్ బ్యాక్ ఘనచరిత్రను పెట్టుకుని, ఇవాళ స్పెషల్ స్టేటస్ గురించి ఓ మాట పలకగానే, తామేదో సాధించినట్లుగా ఉత్తర కుమార ప్రగల్భాలు ఎందులకు?

వివిధ సందర్భాలలో ‘జగన్ అండ్ కో’ ఢిల్లీ వెళ్లి ప్రధాని మరియు ఇతర కేంద్ర మంత్రులను కలిసిన సమయంలో కూడా ప్రత్యేక హోదా గురించి అడిగినట్లు గానీ, చర్చించినట్లు గానీ ఎలాంటి దాఖలాలు లేవు. తాము కేంద్రాన్ని అడిగామని ఇటు రాష్ట్ర ప్రభుత్వం గానీ, అలాగే జగన్ సర్కార్ తమను ప్రత్యేక హోదా అడిగిందని అటు కేంద్ర ప్రభుత్వం గానీ ఈ మూడేళ్ళ సమయంలో ఎప్పుడూ చెప్పలేదు.

కానీ అంది వచ్చిన అవకాశం వైసీపీ అత్యుత్సాహం వలన చేజారిపోయినట్లుగా కనపడుతోంది. కాస్త సంయమనం పాటించినట్లయితే, కేంద్రం ముందుగా విడుదల చేసిన సమాచారం ప్రకారం కనీసం స్పెషల్ స్టేటస్ పై చర్చ అయినా ఉండేదేమో! ఏపీకి ఇచ్చినా ఇవ్వకున్నా, ఒక్కసారైనా ప్రత్యేక హోదా గురించి జరిగే చర్చను ‘నోటి దాకా కాలుతో తన్నినట్లయ్యిందన్న’ చందంగా వైసీపీ తీరు ఉంది. ఇది కేవలం వైసీపీ అత్యుత్సాహం వల్లనే జరిగిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.